తెలంగాణ అసెంబ్లీ `గుంటూరు కాలేజీ`.. విషయం ఏంటి?
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వరుసగా ఏడో రోజు బుధవారం కూడా వాడి వేడిగా సాగుతున్నాయి.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వరుసగా ఏడో రోజు బుధవారం కూడా వాడి వేడిగా సాగుతున్నాయి. బడ్జెట్‌పై ప్రసంగం కాస్తా.. వ్యక్తిగత విషయాలకు కూడా ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. దీంతో సభలో సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా `గుంటూరు కాలేజీ` వ్యవహారం ఆసక్తిగా మారింది.
విషయం ఏంటంటే..
కేసీఆర్ హయాంలో బతుకమ్మ పండుగకు ఏటా పేదలకు చీరలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తరచుగా సీఎం రేవంత్ ప్రస్తావిస్తున్నారు. తాజాగా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. బతుకమ్మ చీరలను సిరిసిల్లలోని చేనేత కార్మికుల నుంచి కొనలేదని.. గుజరాత్‌లోని ప్రముఖ కంపెనీ నుంచి కొనుగోలు చేశారని అన్నారు. ఈ విషయం తనకు ఓ అధికారి చెప్పారని అన్నారు. అయితే.. ఆ అధికారి పేరు సభలో చెప్పకూడదని అందుకే చెప్పడం లేదన్నారు.
కానీ, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారికి(కేటీఆర్) మాత్రం ఈ విషయం తెలుసో తెలియదో తనకు అవగాహన లేదన్నారు. కానీ, ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న తనకు అధికారుల పేర్లను సభలో ప్రస్తావిం చకూడదన్న విషయం అవగాహన ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సమయంలోనే ఆయన 610 జీవో సహా ముల్కీ రూల్ గురించి ప్రస్తావించారు. ``తెలంగాణ ప్రతి ఉద్యోగానికీ నాకు అర్హత ఉంది.`` అని సీఎం రేవంత్ అన్నారు. ఇదేసమయంలో గుంటూరులో చదువుకున్న వారికి(మళ్లీ కేటీఆర్) తెలంగాణలో ఉద్యోగం చేసే అర్హత ఉందో లేదో తెలియదన్నారు.
దీనికి కేటీఆర్ బదులిస్తూ.. ``అధ్యక్షా... నిజమే. నేను గుంటూరు కాలేజీలోనే చదువుకున్నా. కానీ, సీఎం గారు చెబుతున్నట్టు 610 జీవో ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుంది తప్ప.. ప్రైవేటు ఉద్యోగాలకు కాదు. నేను ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేశా`` అని వ్యాఖ్యానించారు. బతుకమ్మ చీరలు సూరత్ నుంచి తెప్పించామని చెబుతున్నారని, కానీ తొలి ఏడాది మాత్రం అక్కడ నుంచి తెప్పించిన మాట వాస్తవమేనని.. కానీ, తర్వాత వారికే అవకాశం ఇచ్చామని చెప్పారు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీలో కొద్దిసేపు గుంటూరు కాలేజీ వ్యవహారం ఆసక్తిగా మారింది.