ముఖ్యమంత్రి బస్సులో.. ప్రతిపక్ష నేత హెలికాఫ్టర్ లో!
అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం హెలికాఫ్టర్ లో నల్గొండ సభకు హాజరు కావటం ఆసక్తికరంగా మారింది.
సిత్రమైన సీన్ ఒకటి తెలంగాణలో ఈ రోజు చోటు చేసుకుంటోంది. వ్యూహం అనునుకోండి. ఎత్తుకు పైఎత్తు అనుకోండి. మొత్తంగా ఒకే రోజున అధికార కాంగ్రెస్.. విపక్ష బీఆర్ఎస్ లకు సంబంధించి కీలకమైన ప్రోగ్రాంలను షెడ్యూల్ చేయటం తెలిసిందే. రెండు కూడా నీటితో ముడిపడిన అంశాలే. కాంగ్రెస్ గోదావరి మీద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలోని లోపాల్ని సమీక్షించేందుకు.. గత ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపే ప్రోగ్రాంను చేపడితే.. క్రిష్ణా జలాలు.. దానిపై నిర్మించిన ప్రాజెక్టుల పర్యవేక్షణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపేందుకు భారీ సభను ఏర్పాటు చేశారు.
ఈ రోజు (మంగళవారం) జరిగే ఈ రెండు కార్యక్రమాలు రాజకీయంగా హైఓల్టేజ్ అన్నది తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ రెండు వేదికలు రాజధాని హైదరాబాద్ కు దూరంగా ఉండేవే. నల్గొండతో పోలిస్తే మేడిగడ్డ మరింత దూరం. అయితే.. ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వీలుగా ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంచుకుంటున్న రవాణా సౌకర్యం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు తన మంత్రులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్సులో ప్రయాణం అవుతున్నారు. ఒక అంచనా ప్రకారం దాదాపు నాలుగు గంటలకు పైనే రోడ్డు మీద ప్రయాణించనున్నారు. తిరిగి వచ్చే టప్పుడు కూడా ఆయన బస్సులో వస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం హెలికాఫ్టర్ లో నల్గొండ సభకు హాజరు కావటం ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా అధికారంలో ఉన్న వారు హెలికాఫ్టర్ లో.. విపక్షంలో ఉన్న వారు రోడ్డు మార్గాన ప్రయాణించటం తెలిసిందే. అందుకు భిన్నంగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న తాజా సీన్ ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గులాబీ బాస్ కేసీఆర్ హెలికాఫ్టర్ లో కాకుండా రోడ్డు మార్గాన వెళ్లి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై రెండు నెలలు కూడా కాని వేళలో.. ఇలా హెలికాఫ్టర్ లో ప్రయాణించే తీరు ప్రజల్లో మరింత విముఖత వ్యక్తమయ్యేలా చేస్తుందన్న విషయాన్ని గులాబీ బాస్ ఎందుకు గుర్తించటం లేదన్నది ఇప్పుడు పార్టీలోనూ చర్చగా మారింది.