రేవంత్ ది పక్కా వ్యూహమేనా ?

అలాంటిది స్వయంగా ముఖ్యమంత్రే వెళ్ళి భేటీ జరిపితే ఇక అనుమానాలు రాకుండా ఎలాగుంటుంది.

Update: 2024-03-15 14:30 GMT

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటి సీట్లను గెలుచుకునేందుకు రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ తో ముందుకుళుతున్నారు. గురువారం జరిగిన డెవలప్మెంట్లే ఇందుకు తాజా ఉదాహరణగా నిలిచింది. విషయం ఏమిటంటే బీజేపీలో కీలక నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి రేవంత్ వెళ్ళారు. పార్టీలోకి ఆహ్వానించారని సమాచారం. ఒక పార్టీ నేతింటికి మరో పార్టీ వెళ్ళారంటేనే పార్టీ మార్పిడిపై సందేహాలు పెరిగిపోతాయి. అలాంటిది స్వయంగా ముఖ్యమంత్రే వెళ్ళి భేటీ జరిపితే ఇక అనుమానాలు రాకుండా ఎలాగుంటుంది.

పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే మహబూబ్ నగర్ పార్లమెంటులో పోటీచేసేందుకు జితేందర్, డీకే అరుణ ఇద్దరు ప్రయత్నించారు. అయితే అగ్రనేతలు అరుణకు టికెట్ ప్రకటించారు. అప్పటినుండి జితేందర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వెంటనే కాంగ్రెస్ నేతలు మాజీ ఎంపీతో టచ్ లోకి వెళ్ళారు. కాంగ్రెస్ లో చేరటానికి జితేందర్ సుముఖత వ్యక్తంచేశారట. కాకపోతే తనకు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారట. ఇదే విషయాన్ని సదరు నేతలు రేవంత్ కు చెప్పగానే వెంటనే అధిష్టానంతో మాట్లాడారట. అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రేవంత్ అర్జంటుగా జితేందర్ ఇంటికి వెళ్ళారు.

పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే చేవెళ్ళ లేదా మల్కాజ్ గిరిలో జితేందర్ ను పోటీచేయమని రేవంత్ అడిగారట. అందుకు జితేందర్ ఓకే చెబితే వెంటనే కాంగ్రెస్ లోకి చేరిపోవటం ఖాయం. అలాగే బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ పైళ్ళ శేఖరరెడ్డితో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ అవ్వటం కలకలం రేపింది. భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చేట్లుగా కోమటిరెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. అధిష్టానంతో ముందు మాట్లాడిన తర్వాతే మంత్రి పైళ్ళకు భువనగిరి టికెట్ ను ఆఫర్ చేవారట. అందుకు పైళ్ళ కూడా సానుకూలంగానే స్పందించారట.

జితేందర్, పైళ్ళ గనుక హస్తంపార్టీలో చేరితే బీజేపీ, బీఆర్ఎస్ కు పెద్ద షాకనే చెప్పాలి. వివిధ జిల్లాల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లోని గట్టి నేతలపైన రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన దృష్టిపెట్టారట. ఎన్నికల షెడ్యూల్లోపు వీలైనంతమంది గట్టి నేతలను లాగేసుకోవాలని రేవంత్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. మరింకా ఎంతమందిని లాక్కుంటారో చూడాలి.

Tags:    

Similar News