కేబినెట్ కూర్పులో రేవంత్ మార్క్.. అందుకే వారికి ఆ శాఖలు
రేవంత్ సేన ప్రజా పాలనలోకి దిగింది. వారి వారికి కేటాయించిన శాఖల్లో మంత్రులు కొలువు దీరారు. వారి అర్హతను బట్టే శాఖలను కేటాయించినట్లు కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు.
రేవంత్ సేన ప్రజా పాలనలోకి దిగింది. వారి వారికి కేటాయించిన శాఖల్లో మంత్రులు కొలువు దీరారు. వారి అర్హతను బట్టే శాఖలను కేటాయించినట్లు కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు. ఈ కేటాయింపులో సైతం రేవంత్ భారీ స్కెచ్ అమలు చేసినట్లు తెలుస్తోంది. మంత్రులకు శాఖల కేటాయింపులో రేవంత్ రెడ్డి ప్రధానంగా తన మార్క్ ను చూపించారు. సీనియర్లకు ప్రాధాన్యత ఉన్న శాఖలే దక్కినా.. కీలకమైన శాఖలను మాత్రం తన వద్దే ఉంచుకున్నాడు సీఎం రేవంత్. ఇంకా తన మంత్రి వర్గంలో ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఆ స్థానాలకు సంబంధించి కేటాయించే శాఖలను తన వద్దనే పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి.
వైఎస్ స్ట్రాటజీనే అమలు చేస్తున్నారా?
మంత్రివర్గం కూర్పులో రేవంత్ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని స్ట్రాటజీని అవలంభించినట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాధాన్యత క్రమంలోనే మంత్రి వర్గం కూర్పు జరిగినా.. కొంత మంది సీనియర్లకు మాత్రం ఆశించిన శాఖ దక్కలేదేమోనని పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతోంది. వైఎస్ తన హయాంలో కాలకమైన శాఖలను తన వద్ద ఉంచుకొని పాలక కొనసాగించారు. పాలన పరుగులు పెట్టిస్తూ సందర్భోచితంగా తన వద్ద ఉన్న శాఖలను వారి అర్హతలకు తగ్గట్ల కేటాయించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో చాలా కీలకమైన హోం శాఖ ను తన వద్దనే పెట్టుకున్నాడు. ఇంకా మంత్రి వర్గంలో ఆరు బెర్త్ లు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ ఖాళీలను ఇప్పుడే పూరించవద్దని హై కమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీని కోసం కొంత కాలం ఆగాలని తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తన వద్ద ఉన్న శాఖలను ఈ ఆరుగురికి కేటాయిస్తారా? లేక తానే స్వయంగా పర్యవేక్షిస్తారా? అనేదానిపై చర్చ జరుగుతోంది.
సీఎం వద్ద ఉన్న శాఖలు ఇవే..
సీఎం వద్ద హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ సంక్షేమం వంటి శాఖలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో హోం శాఖను ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదంటే సీతక్కకు కేటాయించే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. గతంలో వైఎస్ హయాంలో కూడా హోం శాఖను సబితా ఇంద్రారెడ్డి నిర్వహించారు. 2009 నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యే వరకు ఆ శాఖ ఆమె వద్దే ఉంది.
ఇదే విధంగా ఈ సారి సీతక్క వద్ద హోం ఉంచాలని మొదట భావించినా.. ఎందుకో ఈ ఆలోచనను వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో పాటు హోం బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టమైన పని. దీంతో పాటు మున్సిపల్, విద్య, ఎస్సీ సంక్షేమం శాఖల కేటాయింపులో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అనుకుంటున్నారట. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్ల సంఖ్యను పరిగణలోకి తీసుకొని ఈ శాఖలను కేటాయించాలని అనుకుంటున్నారట.
ఎమ్మెల్సీతో భర్తీతో చేస్తారా?
మంత్రివర్గం కూర్పులో ఒకటి, రెండు శాఖలకు సంబంధించి వివిధ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పెద్దల సభ (ఎమ్మె్ల్సీ) నుంచి కొందరిని తీసుకొని వారికి మంత్రి పదవులు ఇవ్వడంపై సీఎం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సంక్షేమం శాఖకు సంబంధించి మంత్రి వర్గంలో ఉన్న ఎస్సీ మంత్రులైన భట్టీ, దామోదరకు పైనాన్స్, వైద్య ఆరోగ్య శాఖలను కేటాయించారు. మరో ఎస్సీని తీసుకుంటేనే ఎస్సీ సంక్షేమ శాఖ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక మైనార్టీ సంక్షేమం గురించి తీసుకుంటే ఈ శాఖకు సంబంధించి కేబినేట్ లో ప్రాతినిద్యం లేదు. వీటిని బట్టి చూస్తే భవిష్యత్ లో ఎమ్మెల్యేలు లేదంటే ఎమ్మెల్సీల నుంచి కూడా తీసుకొని భర్తీ చేస్తారని స్పష్టంగా తెలుస్తుంది.
ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి తన ఎమ్మె్ల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇది ఎమ్మెల్యేల కోటా కాబట్టి ఇక్కడి నుంచి ఒకరిని నియమించాల్సి ఉంటుంది. ఇలా ఇంకా ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే అక్కడ నియమించి మంత్రి వర్గంలో చేర్చుకునే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా మంత్రివర్గం కూర్పులో రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ అవలంభించారని తెలుస్తోంది.