మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవులపై రేవంత్‌ కీలక వ్యాఖ్యలు!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను ఆయన వెల్లడించారు.

Update: 2024-01-07 14:30 GMT

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను ఆయన వెల్లడించారు. మంత్రివర్గంలో ఒక ముస్లింకు తప్పకుండా స్థానం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం రేవంత్‌ కేబినెట్‌ లో ముస్లిం మంత్రులెవరూ లేరు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, మాజీ క్రికెట్‌ క్రీడాకారుడు మహ్మద్‌ అజారుద్దీన్‌ వంటి వారికి టికెట్లు ఇచ్చినా వారు ఎన్నికల్లో గెలుపొందని సంగతి తెలిసిందే.

అయినప్పటికీ ముస్లింలకు తమ మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని రేవంత్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచినవారిలో ముస్లిం ఎమ్మెల్యేలెవరూ లేరని.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీని చేసి మంత్రిపదవిని ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. గవర్నర్‌ కోటాలో ఖాళీ కాబోతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రాజకీయ నేపథ్యం ఉన్నవారిని ఆమె అంగీకరించడం లేదని రేవంత్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో అవన్నీ పరిశీలిస్తున్నామని చెప్పారు. రెండు మూడు రోజుల కిందటే ప్రక్రియ మొదలుపెట్టామన్నారు. ఇది కూడా 100 రోజుల్లోపు పూర్తవుతుందని తెలిపారు.

నామినేటెడ్‌ పదవులను కూడా వెంటనే భర్తీ చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ మాట ఇచ్చిన వారందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. టికెట్లు లభించనివారికి, వేరే నేతల కోసం టికెట్లను త్యాగం చేసినవారికి న్యాయం చేయాల్సి ఉందన్నారు. అద్దంకి దయాకర్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్, వేం నరేందర్‌ రెడ్డి, పటేల్‌ రమేశ్‌ రెడ్డి తదితరులకు పదవులు ఇవ్వాల్సి ఉందని చెప్పారు.

జనవరి నెలాఖరులోపు వీరితో సహా ఎవరికి అయితే హామీ ఇచ్చామో.. వారందరికీ పదవులు ఖరారు చేస్తామని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. అదే విధంగా ప్రభుత్వంలో సలహాదారులను కూడా నియమిస్తామన్నారు.

ప్రొఫెసర్‌ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని చెప్పారు. ఆయన పార్టీకి రెండు ఎమ్మెల్సీలు, నామినేటెడ్‌ పోస్టులు ఇస్తామని ముందే చెప్పామని గుర్తు చేశారు. గవర్నర్‌ కోటాలో కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తామని తెలిపారు. ఆయన లాంటి మేధావి చట్టసభల్లో ఉండాలని సీఎం రేవంత్‌ ఆకాంక్షించారు. తెలంగాణ సమాజం కూడా ఆయన్ను కోరుకుంటోందన్నారు. శాసనమండలిలో వివిధ రంగాల మేధావులను తెచ్చి మళ్లీ పూర్వ వైభవం తేవాలన్నది తన కోరికన్నారు.

ఈ నేపథ్యంలో మైనార్టీ కోటాలో మంత్రి పదవి కోసం షబ్బీర్‌ అలీ, మహ్మద్‌ అజారుద్దీన్‌ వంటివారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

Tags:    

Similar News