ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ.. ఏపీలో అలా.. తెలంగాణ‌లో ఇలా.. !

ఈ నేప‌థ్యంలో తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి క‌మిటీని ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి నేతృత్వం వ‌హించ‌నున్నారు. మొత్తం ఆరుగురితో క‌మిటీని ఏర్పాటు చేశారు.

Update: 2024-09-13 06:30 GMT

ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పున‌కు అనుకూలంగా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చేయాల్సిన అవ‌స‌రం స‌మ‌యం రెండూ రాష్ట్రాల‌కు ఏర్ప‌డ్డాయి. ఈ విష‌యంలో రాష్ట్రాల‌కు స్వేచ్చ‌ను ఇస్తూ.. సుప్రీంకోర్టు నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఎవ‌రినీ నొప్పించకుండా జాగ్ర‌త్త‌గా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని మాత్రం తేల్చి చెప్పింది. అన్ని వ‌ర్గాల ను ప్రాధాన్య అంశంగా తీసుకుని.. వ‌ర్గీక‌ర‌ణ చేయాల్సి ఉంద‌ని పేర్కొంది. ఇదేస‌మ‌యంలో రాజ‌కీయ జోక్యానికి తావు ఉండ‌రాద‌ని కూడా స్ప‌ష్టం చేసింది.

ఇదేస‌మ‌యంలో తేడావ‌స్తే.. తాము జోక్యం చేసుకుంటామ‌ని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం దీనిపై అధ్య‌యనం చేస్తోంది. ఎలా వ‌ర్గీక‌రించాల‌న్న విష‌యం పై ఏపీ సీఎం చంద్ర‌బాబు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. జిల్లాలను యూనిట్‌గా తీసుకుని ఏపీలో వర్గీక‌ర‌ణ చేయాల‌ని భావిస్తున్నారు. దీనికి కార‌ణం.. కొన్ని కొన్ని జిల్లాల్లో మాల సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉంది. మ‌రికొన్ని చోట్ల మాదిగ‌లు ఎక్కువ‌గా ఉన్నారు. దీంతో వారిలో ఎవ‌రికీ ఇబ్బందులు లేకుండా.. వ్య‌వ‌హ‌రించాల‌న్న ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

అయితే.. ఇప్పుడు తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. సీఎం రేవంత్ రెడ్డి మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని వ‌ర్గీక‌ర‌ణ చేయాల‌ని భావిస్తున్నారు. తెలంగాణ‌లో మాదిగ స‌మాజం ఎక్కువ‌గా ఉన్నందున‌.. ఎక్కువ మందికి మేలు చేయాల‌న్న సంక‌ల్పం ఉండి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి క‌మిటీని ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి నేతృత్వం వ‌హించ‌నున్నారు. మొత్తం ఆరుగురితో క‌మిటీని ఏర్పాటు చేశారు.

ఈ ఆరుగురిలో దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌(ఎస్సీ), దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు(ఓసీ), పొన్నం ప్ర‌భాక‌ర్‌(బీసీ), సీత‌క్క‌(ఎస్టీ), మ‌ల్లు ర‌వి(ఎంపీ-ఎస్సీ)లు ఉన్నారు. వీరు అధ్య‌య‌నం చేసి.. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు సంబంధించిన నివేదిక‌ను రూపొందిస్తారు. దీనిని అసెంబ్లీలో పెట్టి ఆమోదించిన త‌ర్వాత‌.. వ‌ర్గీక‌ర‌ణ‌కు శ్రీకారం చుడ‌తారు. అయితే.. అభ్యంత‌రాలు.. సూచ‌న‌లు అనేవి ఈ క‌మిటీకే చెప్పాల్సి ఉంటుంది. అదేస‌మ‌యంలో ఈ క‌మిటీ ఎస్సీ సంఘాల నాయ‌కుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి.. వారి అభిప్రాయాల‌ను తెలుసుకుంటుంది.

Tags:    

Similar News