ఎంపీ బరిలో రేవంత్ సోదరులు.. కీలక నియోజకవర్గాలపై కన్ను!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లను కొల్లగొట్టాలని కృతనిశ్చయంతో ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లను కొల్లగొట్టాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న 17 లోక్ సభా స్థానాల్లోనూ గట్టి అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా ఎక్కువ సీట్లను దక్కించుకోవచ్చని భావిస్తోంది. మొత్తం 17 సీట్లలో కనీసం 10కి పైగా సీట్లలో గెలుపు తథ్యమని లెక్కలేసుకుంటోంది.
త్వరలోనే లోక్ సభ ఎన్నికలకు నగారా మోగనుంది. దీంతో సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధుల వారసులు రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుటుంబం నుంచి కూడా ఇద్దరు ఎంపీలుగా పోటీచేయబోతున్నారని టాక్ నడుస్తోంది.
రేవంత్ సోదరుల్లో ఒకరైన ఎనుముల తిరుపతిరెడ్డి.. మహబూబ్ నగర్ ఎంపీగా బరిలోకి దిగుతున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆయన సీటు కోసం పీసీసీకి దరఖాస్తు కూడా చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు రేసులో ఉండగా తాజాగా తిరుపతిరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు కావడంతో సీటు ఖాయమైందని చెబుతున్నారు.
ఇప్పటికే మహబూబ్ నగర్ లోక్ సభ పరిధిలో ‘తిరుపతి అన్న మిత్రమండలి’ పేరుతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లను అనుచరులు ఏర్పాటు చేయడం గమనార్హం. టికెట్ ఖాయమవ్వడంతోనే వారంతా హడావుడి చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే తిరుపతిరెడ్డి రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటున్నారు. కొడంగల్ లో రేవంత్ తరఫున వ్యవహారాలన్నీ ఆయనే పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు.
2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఓడిపోయాక.. మల్కాజిగిరి నుంచి 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయంలో కొడంగల్ నియోజకవర్గంలో తిరుపతిరెడ్డి అన్నీ తానై చూసుకున్నారు.
అలాగే రేవంత్ రెడ్డి మరో సోదరుడు కొండల్ రెడ్డి కూడా ఎంపీ బరిలో నిలవడానికి ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. రేవంత్ ఎంపీగా కొనసాగిన మల్కాజిగిరి నుంచి ఈయన పోటీ చేస్తారని సమాచారం. ఇప్పటికే కొండల్ రెడ్డి కూడా ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం.
అయితే.. మల్కాజిగిరి సీటును ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా ఆశిస్తున్నారు. వీరందరిలో కొండల్ రెడ్డి చురుగ్గా ఉండటం.. పైగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కావడం, రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో హైకమాండ్ కొండల్ రెడ్డి వైపే చూడొచ్చని అంటున్నారు.