కవర్ చేసే కన్నా.. కేసీఆర్ ను సభకు తీసుకురావొచ్చుగా కేటీఆర్?
తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ఎప్పటిలానే గైర్హాజరు కాని గులాబీ బాస్ కేసీఆర్ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ప్రశ్నించగా.. మాజీ మంత్రి కేటీఆర్ అసహనానికి గురయ్యారు.
నోరు తెరిస్తే ప్రశ్నలు. రేవంత్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఘోరాలు.. నేరాలు.. అన్యాయాలు.. ఆరాచకాలు మరెప్పుడూ చోటు చేసుకోలేదన్నట్లుగా.. తమ పదేళ్ల పాలనలో న్యాయం నాలుగుపాదాల మీద నడిచినట్లుగా బిల్డప్ ఇచ్చే విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ కు మించినోళ్లు మరొకరు కనిపించరు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వీలుగా విపరీతంగా శ్రమించే కేటీఆర్.. ఇటీవల కాలంలో తరచూ దొరికిపోతున్నారు. రేవంత్ సర్కారుకు నీతులుచెప్పే క్రమంలో.. ఆయన అడ్డంగా బుక్ అవుతున్నారు.
తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ఎప్పటిలానే గైర్హాజరు కాని గులాబీ బాస్ కేసీఆర్ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ప్రశ్నించగా.. మాజీ మంత్రి కేటీఆర్ అసహనానికి గురయ్యారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్.. మాజీ మంత్రి కేటీఆర్ మధ్య జరిగిన మాటల యుద్ధం వాతావరణాన్ని గంభీరంగా మార్చేసింది.
అవగాహనారాహిత్యంతో కేటీఆర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కీలక చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ సభకు ఎందుకు రాలేదన్న విషయాన్ని ప్రశ్నించగా.. స్పందించిన కేటీఆర్.. తాము అడిగినప్రశ్నలకు సమాధానాలు చెబితే సరిపోతుందని.. మీకు కేసీఆర్ అవసరం లేదన్న వ్యాఖ్యలు అర్థం లేనివిగా చెబుతున్నారు. పదేళ్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేత.. విపక్ష నేతగా సభను ఎదుర్కోవాల్సి ఉంది. అందుకు భిన్నంగా.. మీకు కేసీఆర్ అవసరం లేదన్న మాటను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎలా అంటారన్నది ప్రశ్న.
దీనికి ఘాటుగా బదులిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తండ్రి పేరు చెప్పుకొని తాను మంత్రిని కాలేదని.. కిందిస్థాయి నుంచి ఎదిగి సీఎంను అయినట్లుగా పేర్కొన్నారు. కేటీఆర్ ది మేనేజ్ మెంట్ కోటా అనుకున్నా కానీ అంతకంటే దారుణమన్న రేవంత్ కు బదులిచ్చే క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ మరింతగా చెలరేగిపోయారు. రేవంత్ పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారని తామూ అనొచ్చంటూ వ్యాఖ్యానించారు.
దీనికి కౌంటర్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్.. "పేమెంట్ కోటాలో సీఎంను కాలేదు. మొన్న బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లి చీకట్లో మాట్లాడుకొని వచ్చారంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు. ముఖ్యమంత్రి మాటలకు బదులిచ్చే క్రమంలో కేటీఆర్.. తనను మేనేజ్ మెంట్ కోటాలో మంత్రిని అయ్యానని సీఎం అనొచ్చా? సభా నాయకుడు అలా మాట్లాడొచ్చా? అన్న కేటీఆర్ మాట్లాడటానికి ముందు.. తాను కెలికిన అంశాల్ని మర్చిపోవటం కనిపిస్తుంది.
అంతేకాదు.. తాము అధికారంలో ఉన్నప్పుడు జానారెడ్డి.. జైపాల్ రెడ్డి లాంటి దిగ్గజ నేతల్ని సైతం అప్పట్లో మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ ఎంతలా తూలనాడారో మర్చిపోలేం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమ పార్టీ అధినేత.. విపక్ష నేతగా ఉన్న పెద్ద మనిషి సభకు రాకపోవటానికి సంబంధించిన లాజిక్ ను తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ కు ఉందన్నది మర్చిపోకూడదు. తమ బిగ్ బాస్ అసెంబ్లీకి రాకపోవటాన్ని కవర్ చేసేందుకు నానా తిప్పలు పడే కన్నా.. ఆయన్ను సభకు తీసుకొస్తే సరిపోతుంది కదా? ఆ పని కేటీఆర్ ఎందుకు చేయట్లేదు చెప్మా?