అజిత్ రెడ్డిని తీసుకురావడంలో రేవంత్ రెడ్డి వ్యూహం అదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్ బి.అజిత్ రెడ్డి ని గురువారం నియమించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్ బి.అజిత్ రెడ్డి ని గురువారం నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అజిత్ రెడ్డి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవోగా పనిచేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో ఇద్దరు అదనపు బ్యూరోక్రాట్లను సెక్రెటరీలుగా నియమిస్తుంటారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఇలా నియామకాలు చేస్తుంది.
జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ లోకేష్ కుమార్, మాణిక్క రాజ్ సీఎంవో అదనపు సెక్రటరీలుగా నియామకం చేయాలని భావిస్తున్నారు. లోకేష్ కుమార్ ను రిలీవ్ చేయడానికి ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ పెండింగులో ఉండటంతో ప్రస్తుతం కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో పనిచేస్తున్న మాణిక్క రాజ్ ను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం సాగునీటి రంగం, విద్యుత్ రంగంపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సహేతుకంగా లేవని ప్రభుత్వం భావిస్తున్నందున ఇందులోని లోపాలను ఎత్తి చూపే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వానికి సహకరించే వారిని అధికారులుగా నియమించుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే అజిత్ రెడ్డి నియామకానికి సీఎం రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం.
ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ కు చెందిన అజిత్ రెడ్డి సమర్థతపై తెలుసుకున్న రేవంత్ రెడ్డి అతడి నియామకానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షంపై చేసే పోరాటంలో మంచి నిపుణులైన వారుంటేనే మంచి పరిపాలన అందించగలమనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అజిత్ రెడ్డిని నియమించుకుని మంచి పరిపాలన అందించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర సర్వీసులో ఉన్న అజిత్ రెడ్డికి అన్ని విషయాలపై సమగ్రమైన అవగాహన ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఆయనను ఓఎస్డీగా నియమించుకున్నట్లు చెబుతున్నారు. అన్ని శాఖల సమన్వయంతో మంచి పరిపాలన అందించే క్రమంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడంలో రేవంత్ రెడ్డి ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.