బాబు బూచిగా రేవంత్ రాజకీయం !

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యాడు

Update: 2024-07-10 06:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఏపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ ఎప్పుడు కూడా చంద్రబాబు పట్ల తన కృతజ్ఞతను కోల్పోలేదు. అనేక వేదికల మీద చంద్రబాబు పట్ల తన విధేయతను రేవంత్ చాటుకున్నాడు.

అయితే కాంగ్రెస్ బీజేపీకి బద్దశతృవు. మరి చంద్రబాబు బీజేపీ కూటమి ఎన్డీఏలో భాగస్వామి. కానీ తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ గెలవడానికి ముఖ్య కారణాల్లో ఒకటి టీడీపీ అస్సలు పోటీ చేయకపోవడం, రెండు టీడీపీ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్ కు బదిలీ కావడం కారణం. టీడీపీ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యమయ్యేది కాదు అని స్వయంగా రేవంత్ కూడా ఒప్పుకున్నాడు.

అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ ను ఎప్పుడైనా ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపుతారన్న ఊహాగానాలు ఉన్నాయి. అందుకే బాబు ఆశీస్సులతో తెలంగాణలో తన పీఠాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని భావిస్తున్నారు.

బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాక్కోవడం వెనక రేవంత్ వ్యూహం కాంగ్రెస్ పార్టీని బలపరచడం కన్నా తన బలం పెంచుకోవడమే లక్ష్యం అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 65 మందిలో రేవంత్ కు అన్ని వేళలా మద్దతు పలికేవారు 25 నుండి 30 లోపే ఉంటుందని సమాచారం.

అందుకే రేవంత్ బీఆర్ఎస్ నుండి చేరికల మీద దృష్టిపెట్టాడు. కొత్తగా చేరిన వారంతా రేవంత్ పట్ల విశ్వాసంగా ఉంటారు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటే తన వర్గంతో పాటు కొత్తగా వచ్చిన వారు తన వైపు ఉంటారన్న ఆలోచనతో చేరికల కోసం రేవంత్ ఇంత తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నాడని తెలుస్తుంది. ఒకటి తన మద్దతుదారులను పెంచుకోవడం, రెండు బాబు అండతో పరోక్షంగా బీజేపీ మద్దతును పొందుతూ కాంగ్రెస్ అధిష్టానం తన విషయంలో ప్రత్యామ్నాయ ఆలోచన లేకుండా చేసుకోవడమే రేవంత్ లక్ష్యంగా కనిపిస్తుందని చెప్పవచ్చు.

Tags:    

Similar News