'పవర్ కట్' కుట్ర చేస్తున్నారంటూ సీఎం రేవంత్ సంచలనం

ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో తరచూ విద్యుత్ కోతల మీద గులాబీ బాస్ కేసీఆర్ మొదలు బీఆర్ఎస్ ముఖ్యనేతలు తరచూ వ్యాఖ్యానించటం తెలిసిందే.

Update: 2024-02-23 04:16 GMT

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసింది మొదలు నిత్యం ఏదో ఒక విమర్శతో ప్రభుత్వానికి ఊపిరి ఆడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైనం తెలిసిందే. ప్రభుత్వం కొలువు తీరిన మూడు.. నాలుగు రోజుల నుంచే ఒత్తిడి మొదలు కావటం ఒక ఎత్తు అయితే.. రెండు వారాలకే ఆరు గ్యారెంటీ హామీల్ని అమలు చేయట్లేదంటూ విమర్శలకు దిగటం చూస్తున్నదే. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో తరచూ విద్యుత్ కోతల మీద గులాబీ బాస్ కేసీఆర్ మొదలు బీఆర్ఎస్ ముఖ్యనేతలు తరచూ వ్యాఖ్యానించటం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కరెంటు కోత లేదని.. అయితే అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగేలా కొందరు అధికారులు.. సిబ్బంది వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి పనులు చేసే అధికారులు.. సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు. విద్యుత్ సరఫరాపై గురువారం సచివాలయంలో విద్యుత్ శాఖాధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు.. విద్యుత్ పై దుష్ప్రచారం చేసే కుట్ర తమ ద్రష్టికి వచ్చిందన్నారు.

ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే ఉద్దేశపూర్వకంగా కోతలు పెడుతున్నారన్న సమాచారం తమకు ఉందన్నారు. గతంతో పోలిస్తే విద్యుత్ సరఫరా పెంచినా.. కోతలు పెడుతున్నారంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందన్నారు. ఇటీవల రాష్ట్రంలోని మూడు సబ్ స్టేషన్లలో కొంతసేపు సరఫరాకు అంతరాయం కలగటాన్ని ప్రశ్నించగా.. లోడు హెచ్చుతగ్గులను డీఈలు సరి చూసుకోకపోవటమే కారణమని చెప్పగా.. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వాతావరణ పరిస్థితుల కారణంగా.. సాంకేతిక అంశాల కారణంగా మినహాయిస్తే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కోతలకు కారణమైతే ఉపేక్షించొద్దన్న ఆయన.. రిపేర్లు.. టెక్నికల్ అంశాలతోసరఫరా నిలిపేయాల్సిన పరిస్థితి వస్తే.. ముందుగానే వినియోగదారులకు సమాచారం ఇవ్వాలన్నారు. గత ఏడాది జనవరిలో243.12 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తే.. గత ఫిబ్రవరి 1 నుంచి 13వ తేదీల్లో 264.95 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఇచ్చారు. ఈ ఏడాది ఇదే సమయానికి 264.95 మిలియన్ యూనిట్లు సరఫరా చేయటం గమనార్హం. అయినప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్న వైనంపై సీఎం సీరియస్ అయ్యారు. అయితే.. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి ఆలస్యంగా స్పందించారని.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకొని ఉండి ఉంటే.. మిగిలిన వారికి హెచ్చరికగా మారేందంటున్నారు. ఏమైనా.. ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగా చెడ్డపేరు తెచ్చే వారి విషయంలో అస్సలు ఉపేక్షించకూడదన్న మాట బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News