తిరుమల విషయంలో రోజాకు నెటిజన్లు స్పష్టత ఇచ్చినట్లేనా?

ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ మహా ప్రసాదం విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-24 05:23 GMT

ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ మహా ప్రసాదం విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై ఏపీలో రాజకీయాలు పీక్స్ కి చేరుతున్నాయి. వాస్తవానికి ఇది రాజకీయాలకు సంబంధం లేని అంశగా చూడాల్సిన అంశం అయినప్పటికీ.. కాదేదీ రాజకీయాలకు అతీతం అనే కాన్సెప్ట్ లో ఈ విషయం కూడా రాజకీయ రంగు పులుముకుంది.


ఈ విషయంలో దోషులు ఎంతటివారైనా కఠినచర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక తాము జగన్ ను తప్పుపట్టడం లేదు కానీ... ఆయన ఏర్పాటు చేసిన బోర్డు గత ఐదేళ్లలో ఎన్నో అక్రమాలు చేసినా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు.. తప్పుచేసిన వారిని జగన్ ఎందుకు సమర్ధిస్తున్నారన్నట్లు ప్రశ్నిస్తున్నారు పవన్ కల్యాణ్! ఈ నేపథ్యంలో రోజా ఎంట్రీ ఇచ్చారు.


అవును... తిరుమల లడ్డూ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, సీరియస్ గా స్పందించి విచారణకు ఆదేశించాలంటూ ప్రధాని మోడీకి జగన్ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం విచారణ దశలో ఉంది. మరోపక్క ప్రాయచ్చిత్త దీక్షలు జరుగుతున్నాయి.



ఈ సమయంలో స్పందించిన మాజీ మంత్రి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తన సొంత యూట్యూబ్ ఛానల్ లో ప్రజలపై మూడు ప్రశ్నలు సంధించారు. ఇందులో భాగంగా... "తిరుమల లడ్డూ ముమ్మాటికీ టీడీపీ కుట్ర..?" అని ఒక ప్రశ్న సంధించారు. దీనికి సమాధానంగా స్పందించిన నెటిజన్ల రియాక్షన్ మాత్రం చూసే అవకాశం ఇవ్వలేదు రోజా.

కామెంట్స్ సెక్షన్ లోకి వెళ్తే మాత్రం కాస్త క్లారిటీ వస్తోంది! ఇక మిగిలిన రెండు ప్రశ్నలకు సంబంధించి నెటిజన్ల సమాధానం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా... "వీరిలో తిరుమలలో ఎవరి పాలన బాగుంది?" అని రోజా నెటిజన్లకు మరో ప్రశ్న సంధించారు. దీనికి సమాధానంగా స్పందించిన నెటిజన్లలో జగన్ పాలన బాగుందని 23% మంది రియాక్ట్ అయ్యారు.

ఇక మిగిలిన 77% మంది చంద్రబాబు పాలనలోనే తిరుమలలో బాగుందని రెస్పాండ్ అయ్యారు. ఇదే క్రమంలో... "తిరుమల లడ్డూ కల్తీలో తప్పు ఎవరిది..?" అని తొలుత ఓ ప్రశ్న సంధించగా... దీనికి సమాధానంగా... పవన్ ది తప్పు అని 7% మంది, చంద్రబాబుది తప్పు అని 20% మంది రెస్పాండ్ అవ్వగా.. 73% మంది మాత్రం జగన్ ది తప్పని స్పందించారు.

దీంతో... నెట్టింట రోజా ప్రయత్నించిన ఈ పోల్స్ వ్యవహారాన్ని సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు నెటిజన్లు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకూ రాజకీయ ఆరోపణలు ఉన్నాయి.. వీటిపై అధికారికంగా ఎవరు దోషులు, తప్పు ఎక్కడ జరిగింది మొదలైన ప్రశ్నలకు సిట్ సమాధానం ఇవ్వనున్న నేపథ్యంలో... రోజా ఇలా అత్యుత్సాహం ప్రదర్శించి జగన్ ను బద్నాం చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఇది వైసీపీకి వ్యతిరేక మీడియాగా ముద్రపడిన సంస్థల నుంచో లేక, థర్డ్ పార్టీ నుంచో వెలువడితే కచ్చితంగా రోజా అంతెత్తున లేచి ఫైరయ్యేవారు!! అయితే... స్వయంగా ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ లో నిర్వహించిన సర్వేలో జగన్ కు ఇలా పూర్తి వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో... మౌనంగానే ఉన్నారని అంటున్నారు! మరి ఈ పోల్స్ ని అలానే ఉంచుతారా.. లేక, డిలీట్ చేస్తారా అనేది వేచి చూడాలి!!

Tags:    

Similar News