ఫస్ట్ ఫ్లోర్ లో లో మిస్సైళ్లు.. కిచెన్ లో రాకెట్లు.. హిజ్బుల్లా వీడియో

హిజ్బుల్లాలు ఎంతటి ప్రమాదకారులో వివరిస్తూ వీటిని ఇజ్రాయెల్ వెలుగులోకి తెచ్చింది.

Update: 2024-09-24 07:49 GMT

పైకి అవి చూసే సాధారణ ఇల్లే.. రెండు మూడు అంతస్తుల నిర్మాణాలే.. కానీ.. వంటింట్లో రాకెట్లు.. బాత్రూమ్ లో మిస్సైళ్లు.. ఇదీ హిజ్బుల్లా తీరు. 20 ఏళ్లుగా సాధారణ ప్రజల నివాసాలను ఎంచుకుని ఆ ఉగ్ర సంస్థ సాగిస్తున్న దారుణాలను కళ్లకు కట్టేలా వీడియోలు బయటకు వచ్చాయి. హిజ్బుల్లాలు ఎంతటి ప్రమాదకారులో వివరిస్తూ వీటిని ఇజ్రాయెల్ వెలుగులోకి తెచ్చింది. అసలు ఇంట్లో ఉన్నవారికి తెలుసో లేదు.. కానీ.. రెండు దశాబ్దాలుగా రాకెట్లు, వార్ హెడ్స్ ను అమరుస్తూ వస్తోందని తెలిపింది.

అందుకే భీకర దాడులు

ఇజ్రాయెల్ తమ దేశానికి సరిహద్దుల్లో ఉండే దక్షిణ లెబనాన్ లోని గ్రామాలు, పట్టణాలను సోమవారం టార్గెట్ చేసుకుంది. వేలాది మంది ప్రజలను ఇళ్లు విడిచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని కోరింది. దీనికి కారణం.. ప్రజల ఇళ్ల మధ్యలో హిజ్బుల్లాలు నివాసాలు ఏర్పాటు చేసుకుని వాటిని ఆయుధాగారాలుగా మార్చుకున్నట్లు తేలడమే. హిజ్బుల్లాలు పౌరుల ఇళ్లల్లో భారీగా క్రూజ్‌, ఇతర క్షిపణుల ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పైకి అందరి ఇళ్లలాగే ఉన్నా.. మొదటి అంతస్తులో క్షిపణులు వాటిపై శక్తిమంతమైన వార్‌ హెడ్స్‌ ను అమర్చి ఉండడం గమనార్హం. ఇలా 20 ఏళ్ల నుంచి ప్రజల ఇళ్లల్లో అమరుస్తూ వస్తోందని ఇజ్రాయెల్ తెలిపింది. అందుకనే సోమవారం విరుచుకుపడింది. 1,600 టార్గెట్లపై దాడులు చేసింది. చాలా క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసింది.

అతడి కోసం వేట..

హిజ్బుల్లా కీలక కమాండర్లను ఏరివేస్తున్న ఇజ్రాయెల్ ఒక్కడి కోసం మాత్రం వేట సాగిస్తోంది. అతడే అలీ కరాకీ. సోమవారం రాత్రి వైమానిక దాడులు చేసినా తప్పించుకున్నాడు. కరాకీ హిజ్బుల్లా దక్షిణ కమాండ్‌ కు అధిపతి. తాజాగా దాడులు చేసిన దక్షిణ లెబనాన్‌ వ్యవహారాలను ఇతడే చూస్తున్నాడు. జిహాద్‌ కౌన్సిల్‌ సభ్యుడు కూడా. నాసర్‌, అజిజ్‌, బదెర్‌ రీజనల్‌ డివిజన్లకు సారథ్యం వహిస్తున్నాడు. హిజ్బుల్లా నంబర్-2, రద్వాల్‌ ఫోర్స్‌ చీఫ్ ఇబ్రహీం అకిల్‌ స్థానంలోకి ఇతడు వచ్చాడు.

Tags:    

Similar News