దుర్గ గుడి మెట్లు శుభ్రం చేసిన పవన్... ఫోటోలు వైరల్!
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మరోపక్క ఈ ఘటన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా నేడు ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.
అవును... ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా పవన్ కల్యాణ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో మెట్లను శుభ్రం చేశారు. ఈ సమయంలో ముందుగా ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మెట్లను శుభ్రం చేసిన పవన్ కల్యాణ్.. అనంతరం ఆ మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు.
వేద పండితుల మత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పవన్ కల్యాణ్.. దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బాలశురి, కేశినేని చిన్ని, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాయశ్చిత్త దీక్షను అక్టోబరు 2న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విరమించనున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా గత పాలకులతో పాటు టీటీడీ బోర్డు వ్యవహారాన్ని పవన్ తప్పుబట్టారు. ఇందులో భాగంగా... దుర్గగుడిలో వెండి సింహాలు మాయమైతే.. ఆ వ్యవహారంపై అవహేళనగా మాట్లాడారని.. ఆ మాటలు బాధ కలిగించాయని తెలిపారు!
ఈ దేశంలో సెక్యులరిజం అనేది టూవేగా ఉండాలి. సెక్యులరిజం కేవలం వన్ వే మాత్రం కాదని.. ఇతర మతాల ఆచారలకు, సంప్రదాయాలకు విఘాతం కలిగితే ఎలా స్పందిస్తున్నారో, హిందువుల మనోభవాలకు, ఆచారాలకు విఘాతం కలిగినా కూడా స్పందించాలని తెలిపారు.
జగన్ నియమించిన టీటీడీ బోర్డులో తప్పు జరిగిందని.. ల్యాబ్ రిపోర్ట్ లతో సహా విషయం బయటకు వచ్చినా దబాయింపు చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని.. తప్పు జరిగినా కూడా ఇష్టానుసారం మాట్లాడటం మంచిది కాదని.. ఇలాంటి సమయాల్లో ప్రాయశ్చిత్తం లేదా మౌనం మేలని సూచించారు.
లడ్డు అపవిత్రం అయ్యిందని తాము మాట్లాడితే.. హైకోర్టు ఏజీపీగా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాత్రం.. పందికొవ్వు చాలా ఎక్కువ ధర ఉంటుందని, దాన్ని సాధారణ నెయ్యిలో ఎలా కలుపుతారని చాలా అవహేళనగా మాట్లడుతున్నారని.. ఆయన కూడా హిందువే అని.. అయినప్పటికీ భక్తుల మనోభావాలు మరింత దెబ్బ తినేలా ఈ మాటలు ఉన్నాయని అన్నారు.
ఇక ఇటీవల ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేసిన విషయాన్ని ప్రస్థావిస్తూ... తనకు ప్రకాశ్ రాజ్ మంచి మిత్రుడు అని, ఆయనపై ఎనలేని గౌరవం ఉందని, అయితే సనాతన ధర్మానికి భంగం కలిగినప్పుడు ఆ ధర్మాని ఆచరించే వాళ్లు మాట్లాడటం కూడా తప్పే అన్నట్లు చెబితే ఎలా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో... సినిమా ఇండస్ట్రీలో కూడా సనాతన ధర్మంపై ఇష్టానుసారంగా జోకులు వేస్తున్నారని.. ఇది సరైంది కాదని అన్నారు!
ఇక తాజాగా కరుణాకర్ రెడ్డి పెద్ద యాక్టింగ్ చేశారని.. విచారణకు రమ్మంటే వైవీ సుబ్బారెడ్డి ఫైల్స్ అడుగుతున్నారని తెలిపారు. ఇంత పెద్ద అపచారం జరిగితే అప్పటి ఈవో ధర్మారెడ్డి గాయబ్ అయ్యారని.. ఆయన కొడుకు చనిపోతే కనీసం 11 రోజులు కూడా ఆలయంలోకి వెళ్లకుండా ఉండలేకపోయారని విమర్శించారు.
ఈ సందర్భంగా హిందువులంతా బయటకు రావాలని పవన్ పిలుపు నిచ్చారు! సనాతన ధర్మ రక్షణ కోసం తాను తుదివరకూ పోరాడతానని.. అవసరమైతే ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధమని చెబుతూ... సనాతన ధర్మాన్ని ఎంతో హుందాగా వచ్చే తరానికి అందించాల్సిన బాధ్యత మనపై ఉందని పవన్ తెలిపారు!