ఆయనకే స్పీకర్‌.. నిరాశలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్యాన్స్‌!

కాగా ఇంకా కొత్తగా ఎన్నికయిన శాసనసభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయలేదు.

Update: 2024-06-17 11:26 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కళ్యాణ్‌ బాధ్యతలు చేపట్టారు. మరో 23 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు,

కాగా ఇంకా కొత్తగా ఎన్నికయిన శాసనసభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయలేదు. ఇది జరగాలంటే ముందు శాసనసభకు స్పీకర్‌ ను, డిప్యూటీ స్పీకర్‌ ను ఎన్నుకోవాల్సి ఉంది. ఇంకా స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగలేదు. 19 నుంచి శాసనసభ సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ను ఎన్నుకుంటారని సమాచారం. డిప్యూటీ స్పీకర్‌ పదవిని జనసేన పార్టీకి కేటాయిస్తారని తెలుస్తోంది. ఆ పార్టీ తరఫున లోకం మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్, పంతం నానాజీ పేర్లు డిప్యూటీ స్పీకర్‌ పదవికి వినపడుతున్నాయి,

ఇక స్పీకర్‌ పదవి టీడీపీకి దక్కనుంది. అయితే ఈ పదవికి నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడును ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. ఆయన కూడా తన సన్నిహితులకు ఈ మేరకు చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. నర్సీపట్నం నుంచి అయ్యన్నపాత్రుడు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో ఆయనను స్పీకర్‌ పదవికి ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

మరోవైపు స్పీకర్‌ పదవిని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూడా ఆశించారు. ముఖ్యంగా ఆయన కంటే ఆయన అభిమానులు, కొందరు నెటిజన్లు ఆర్‌ఆర్‌ఆర్‌ స్పీకర్‌ కావాలని బలంగా కోరుకుంటున్నారు. అధ్యక్ష స్థానంలో ఆర్‌ఆర్‌ఆర్‌ కూర్చోవాలని.. ప్రతిపక్ష నేత జగన్‌ కు మాట్లాడటానికి మైకు కూడా ఇవ్వకూడదని ఆశిస్తున్నారు.

2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా విజయం సాధించిన రఘురామకృష్ణరాజు కొద్ది కాలానికే ఆ పార్టీకి దూరమయ్యారు. నిత్యం వైసీపీ ప్రభుత్వ విధానాలపై రచ్చబండ పేరుతో సోషల్‌ మీడియా ద్వారా, యూట్యూబ్‌ ద్వారా తీవ్ర విమర్శలు చేసేవారు. ఈ క్రమంలో రఘురామపై వైసీపీ ప్రభుత్వం కేసులు కూడా పెట్టి ఆయనను అరెస్టు చేసింది. జైల్లో సీఐడీ అధికారులు తనను హింసించారని రఘురామ ఆరోపించారు.

జగన్‌ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు రఘురామకృష్ణరాజు అలుపెరగని పోరాటం చేశారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే విచిత్రంగా ఆయనకు మూడు పార్టీలు.. టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి సీటు దక్కలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్యాన్స్‌ నుంచి తీవ్ర విమర్శలు రేగడంతో చివరకు ఉండిలో అభ్యర్థిని తప్పించి మరీ చంద్రబాబు.. రఘురామకు సీటిచ్చారు. తీవ్ర పోటీని తట్టుకుని ఆయన విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్‌ గా పనిచేయాలని రఘురామ ఉవ్విళ్లూరుతున్నారని అంటున్నారు. అయితే అయ్యన్నపాత్రుడి పేరు ఈ పదవికి గట్టిగా వినిపిస్తుండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్యాన్స్‌ నిరాశ చెందుతున్నారని టాక్‌ నడుస్తోంది.

Tags:    

Similar News