రిజర్వేషన్ల రద్దు మీద ఆరెస్సెస్ మాటే ఫైనల్ !?

దేశంలో రిజర్వేషన్లు ఉండాలా వద్దా అన్నది అతి పెద్ద డిబేట్. ఇది సుదీర్ఘ కాలంగా జరుగుతూ వస్తోంది.

Update: 2024-04-29 03:59 GMT

దేశంలో రిజర్వేషన్లు ఉండాలా వద్దా అన్నది అతి పెద్ద డిబేట్. ఇది సుదీర్ఘ కాలంగా జరుగుతూ వస్తోంది. ఈ దేశంలో రిజర్వేషన్ల విధానం తీసుకుని వచ్చింది మన వాళ్ళు కాదు బ్రిటిష్ వారు. వారి హయాంలో పాలన సాగుతున్నపుడు వెనకబడిన అట్టడుగు వర్గాలకు కొంత ఊతం ఇవ్వాలని ఈ విధానం తెచ్చారు. అయితే అది భారత రాజ్యాంగం రాసుకున్న తరువాత కూడా కంటిన్యూ అయింది. రిజర్వేషన్లు అన్నది ఉండాల్సిందే అని వాదించే వర్గాలు ఉన్నాయి వద్దు అన్న వారూ ఉన్నారు.

అయితే బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని విపక్షాలు చాలా కాలంగా ఆరోపిస్తూ వస్తున్నాయి. ఈసారి మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి మేము చేసే పాలన వేరే లెవెల్ లో ఉంటుందని బీజేపీ అగ్ర నేతలు చెబుతూ వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అయితే గత పదేళ్ల పాలన అంతా జస్ట్ ట్రైలర్ మాత్రమే అని చాలా సభలలో చెప్పారు. ఈసారి బీజేపీ గెలిస్తే చేసేదే అసలైన పాలన, సినిమా అంతా అపుడే అని అంటున్నారు.

దీనిని విపక్షాలు పట్టుకుని దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తారు అని ప్రచారం మొదలెట్టేశాయి. అలాగే రాజ్యాంగం మారుస్తారు అని కూడా అంటూ వచ్చారు. రాజ్యాంగాన్ని మార్చడం మీద అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. సాక్షత్తూ అంబేద్కర్ దిగి వచ్చినా కూడా రాజ్యాంగాన్ని మార్చేది ఉండదని ఆయన ఖండితంగా చెప్పారు. తాము ఆ జోలికి పోవడం లేదు అని అన్నారు

ఇక ఇపుడు రిజర్వేషన్లు రద్దు గురించి ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. తాజాగా తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని మొత్తానికి మొత్తం పోతాయని సంచలన ప్రకటన చేశారు. దాంతో రాజకీయ అలజడి రేగింది. దీని మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే కౌంటర్ ఇచ్చారు. మాకు ఆ ఆలోచనే లేదని అన్నారు. రేవంత్ రెడ్డి తన మాటలు మాకు ఆపాదిస్తున్నారు అని మండిపడ్డారు.

అయితే దీని మీద చాలా అనుమానాలు అలాగే ఉన్నాయి. దాంతో బీజేపీకి మాతృ సంస్థ అయిన ఆరెస్సెస్ సీన్ లోకి వచ్చింది. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అయితే పూర్తి స్థాయిలో ఖండించారు. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం అని ఒక వీడియో వైరల్ అవుతోందని అదంతా తప్పు అని ఆయన స్పష్టం చేశారు. అవసరం ఉన్నంతవరకూ వాటిని కొనసాగించాల్సిందే అని ఆయన అన్నారు.

హైదరాబాద్ లోని నాదర్ గుల్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో భేదభావాలు పోయేంతవరకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అని ఆయన సమర్ధించారు. ఈ విషయంలో ఆరెస్సెస్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఈ విధంగా భగవత్ చెప్పడం ఇది చాలాసార్లు జరిగింది. కానీ రిజర్వేషన్ల కొనసాగింపు మీద అనుమానాలు అలాగే ఉన్నాయి.

మరో వైపు చూస్తే రిజర్వేషన్ల వల్ల దేశం ముందుకు సాగడం లేదని ప్రతిభావంతులు మేధ సంపత్తి వలస బాట పడుతోందని కీలకమైన చర్చ కూడా ఉంది. రిజర్వేషన్లు ఉండాల్సిందే కానీ వాటిని సైతం పరిమితం చేయాలన్న మాట కూడా ఉంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రిజర్వేషన్ ఫలితాలను పొంది సమాజంలో ముందు స్థానం లోకి వచ్చినపుడు వారి కుటుంబానికి రిజర్వేషన్లు అవసరం ఉండదని అదే బడుగు బలహీన వర్గాలకు చెందిన మరో పేదకు ఆ అవకాశం ఇవ్వాలన్న వాదన కూడా ఉంది. ఒక కుటుంబానికి ఒక్కసారే చాన్స్ అన్న ఆలోచన మీద కూడా చర్చ సాగుతోంది.

మరో వైపు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ఒక్కోటిగా ప్రైవేట్ పరం చేస్తున్నారు.ప్రభుత్వ విద్య కంటే ప్రైవేట్ విద్యకు పెద్ద పీట వేస్తునారు. ఈ నేపధ్యంలో రిజర్వేషన్లు ఉన్నా కూడా వాటి వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమిటి అన్నది కూడా ఆయా అణగారిన వర్గాలలో వస్తున్న ప్రశ్న. ఇవన్నీ పక్కన పెడితే ఆరెస్సెస్ రిజ్రవేషన్ల రద్దు విషయంలో ఒక క్లారిటీ ఇచ్చి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది అనుకోవచ్చా లేక మూడవసారి మోడీ ప్రభుత్వం అధికారం చేపడితే ఈ విషయంలో ఏమైనా మార్పులు ఉంటాయా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు

Tags:    

Similar News