ఏపీ సచివాలయంలో కోట రుక్మిణి.. ఎంట్రీతోనే హవా చూపించారట!
సినిమాలో చూపినంత డ్రామా కానప్పటికీ.. కాస్త ఆ సీన్ తో రిలేట్ చేసే సీన్ ఏపీ సచివాలయంలో చోటు చేసుకుంది.
‘అత్తారింటికి దారేది’ మూవీలో ఒక సీన్ ఉంటుంది. హోటల్ లో సెటిల్ మెంట్ కోసం నదియాను పిలవటం.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫేం ప్రథ్వీ.. పోసాని.. పోలీసు అధికారి క్యారెక్టర్లు ఆమెను బ్లాక్ మొయిల్ చేయటం.. ఆ సీన్లోకి పవన్ కల్యాణ్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన సందర్భంలో నువ్వెవర్రా? అన్న పోలీసు ఆఫీసర్ మాటకు.. ఎంఎస్ నారాయణ వైపు పవన్ చూడటంతోనే.. ఫోన్ చేసి.. ఫోన్ వచ్చేస్తుందని చెప్పటం.. అంతలోనే ఫోన్ రావటం.. థర్టీ ఇయర్స్ ప్రథ్వీ క్యారెక్టర్ కు ఫ్యూజులు ఎగిరిపోవటం తెలిసిందే. సినిమాలో చూపినంత డ్రామా కానప్పటికీ.. కాస్త ఆ సీన్ తో రిలేట్ చేసే సీన్ ఏపీ సచివాలయంలో చోటు చేసుకుంది.
జనసేనాని పవన్ కల్యాణ్ కు సన్నిహితురాలిగా.. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తారన్న పేరున్న కోట రుక్మిణి తొలిసారి ఏపీ సచివాలయానికి వచ్చారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతున్న వేళలో ఏపీ సచివాలయానికి వచ్చిన సందర్భంగా అనూహ్య పరిణామం ఒకటి చోటుచేసుకుంది. సచివాలయంలోకి అడుగు పెట్టిన వెంటనే అక్కడి సిబ్బంది సహకారంతో మంత్రివర్గ సమావేశం జరిగే సచివాలయం మొదటి అంతస్తులోకి ఆమె వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆమె వెంట ఒకరిద్దరు సిబ్బంది కనిపించారు.
సచివాలయానికి ఆమె తొలిసారి రావటం.. ఆమెను పోలీసులు గుర్తించలేదు. దీంతో.. ఆమెకకు లోపలకు వెళ్లటానికి అనుమతి లేదని చెప్పారు. దీంతో.. ఆమె ఒక క్షణం ఆగి తన ఫోన్ తో ఎవరికో ఫోన్ చేశారు. క్షణాల వ్యవధిలో అక్కడున్న భద్రతా సిబ్బందికి పవన్ కల్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఛాంబర్ నుంచి ఆదేశాలు రావటంతో అక్కడ సీన్ మారిపోయింది. అప్పటివరకు ఆమెకు అనుమతి నో చెప్పిన అధికారులే.. ప్రత్యేక మర్యాదతో లోపలకు పంపారు. ఈ వ్యవహారం అక్కడ పలువురిని ఆకర్షించింది.
కోట రుక్మిణి గురించి తెలియని వారు.. ఆమె ఎవరు? అంటూ వాకబు చేయటంతో ఆమె వార్తల్లోకి వచ్చారు. క్రిష్ణా జిల్లాలకు చెందిన కోట రుక్మిణి గతంలో లండన్ లో నివసించేవారు. ఆమెకు అక్కడో టాప్ బ్రాండెడ్ షాప్ ఉందని చెబుతారు. రాజకీయాల వైపు ఆకర్షితులైన ఆమె జనసేనలో చేరటంతో పాటు.. ఆ పార్టీ సెంట్రల్ ఆఫైర్స్ కమిటీ వైస్ ఛైర్మన్ గా ఎంపికయ్యారు. అనతికాలంలో పార్టీలో ఆమె మాటే వేదంగా మారిందన్న వాదన ఉంది. గతంలో పార్టీకి చెందిన మహిళా నేత పసుపులేటి పద్మావతి పార్టీకి రాజీనామా చేయటం.. రుక్మిణి తనను ఎలా ఇబ్బందులకు గురి చేశారన్న అంశంపై 140 పేజీల లేఖ రాయటం అప్పట్లో సంచలనంగా మారింది. ఏది ఏమైనా సచివాలయం ఎపిసోడ్ తో కోట రుక్మిణి మరోసారి వార్తల్లోకి వచ్చారని చెప్పాలి.