సజ్జల అక్కడికి షిఫ్ట్...అందుకేనా ?

ముఖ్యమంత్రికి అధికార ప్రతినిధి అని ఆయన డిఫ్యాక్టో సీఎం ని కూడా గుసగుసలు పోయేవారు.

Update: 2024-08-22 01:30 GMT

వైసీపీ అంటే సజ్జల. తాడేపల్లిలో పార్టీ ఆఫీసులో ఆయనే ఎటు చూసినా కనిపించేవారు. వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ళ పాలనలో సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించేవారు అని చెప్పుకున్నారు. ఆయనను సకల శాఖల మంత్రి అని కూడా సంబోధించేవారు. ముఖ్యమంత్రికి అధికార ప్రతినిధి అని ఆయన డిఫ్యాక్టో సీఎం ని కూడా గుసగుసలు పోయేవారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే సజ్జల వైసీపీలో చక్రం తిప్పారు. ఆయన లేని వైసీపీని నాడు ఎవరూ ఊహించలేకపోయారు. ఇపుడు చూస్తే సజ్జల ఎక్కడ అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వైసీపీ సమావేశాలలో ఎక్కడా ఆయన కనిపించడం లేదు. సజ్జల సడెన్ గా ఏమయ్యారు. ఆయన ఎక్కడ ఉంటున్నారు అన్న చర్చకు తెర లేస్తోంది.

సజ్జలను జగన్ ఎంతగానో నమ్మి ఆయనకే అన్నీ అప్పగించారు అని వైసీపీలో చెప్పుకున్నారు. సజ్జల వద్దకే అందరూ వెళ్ళేవారు పార్టీలో ఏ సమస్య వచ్చినా లేక ప్రభుత్వంలో ఏ పని ఉన్నా సజ్జల వద్దకే దారి తీసేవారు. అలా వైసీపీలో ఒక వెలుగు వెలిగిన సజ్జల జాడ అయితే ఇపుడు లేకుండా పోయింది. ఏమి జరిగింది అని వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

వైసీపీ దారుణమైన ఓటమిని చవి చూడగానే రకరకాలైన విశ్లేషణలను వినిపించారు. దాంతో పాటు చాలా మంది నేతలు సజ్జల మీదనే ఆరోపణలు చేసారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక వైసీపీలో ప్రక్షాళన జరుగుతుందని కూడా ప్రచారంలో ఉంది. దాంతో పాటే సజ్జల ప్లేస్ కూడా మారిందా అన్నది ఇపుడు జరుగుతున్న చర్చ.

ఇవన్నీ పక్కన పెడితే సజ్జల ఎక్కడ ఉన్నారు అన్న దాని మీద రకరకాలుగా వినిపిస్తోంది. అయితే సజ్జల హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారని అంటున్నారు. ఆయన మీదనే వైసీపీ నేతలు అంతా ఆరోపణలు చేయడంతో పాటు జగన్ నేరుగా పార్టీ వ్యవహారాలు చక్కబెట్టాలని నిర్ణయించుకోవడంతోనే సజ్జలకి తాడేపల్లిలో పని లేకపోయింది అని అంటున్నారు.

ఆయన కుమారుడు భార్గవ్ ని కూడా సోషల్ మీడియా వింగ్ నుంచి తప్పించారు అన్న వార్తలు వినిపించాయి. ఈ మొత్తం పరిణామాల నేపధ్యంలో సజ్జల పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా బొత్స ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన సందర్భంలోనూ జగన్ తో సమావేశం అయిన నేపధ్యంలోనూ సజ్జల ఎక్కడా కనిపించలేదు అని గుర్తు చేస్తున్నారు.

మరో వైపు చూస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం సజ్జలను టార్గెట్ చేసింది అని అంటున్నారు. ఆయన గత అయిదేళ్ళూ కీలకంగా వైసీపీ ప్రభుత్వంలో ఉంటూ టీడీపీ నేతల మీద కేసులకు కారకులు అయ్యారని కూటమి పెద్దలు భావిస్తున్నారు. దాంతో సజ్జల మీద కేసులు తొందరలోనే నమోదు చేస్తారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వీటన్నింటి మధ్య సజ్జల ఏకంగా ఏపీకే దూరం అయి హైదరాబాద్ లో ఉంటున్నారు అని అంటున్నారు. ఇక తన మీద కేసులు నమోదు అయితే వాటి నుంచి బయటపడడానికి కూడా ఆయన ముందస్తు వ్యూహాలతో ఉన్నారని అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ సైతం గతంలో మాదిరిగా తాడేపల్లి లో ఎక్కువగా ఉండడం లేదు ఆయన బెంగళూరులో అధిక సమయం గడుపుతున్నారు.

దాంతో సజ్జల కూడా హైదరాబాద్ లో ఉంటున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా తాడేపల్లి అయితే బోసిపోయింది అని అంటున్నారు. ఒక వైపు జగన్ మరో వైపు సజ్జల ఇంకా ఇతర పార్టీ నేతలతో కళకళలాడే తాడేపల్లి వారంలో రెండు మూడు రోజులు మాత్రమే సందడి చేస్తోంది అని అంటున్నారు. రాజకీయాల్లో వెలుగు నీడలు సహజం. ఇపుడు వైసీపీని చీకటి ఓటమి రూపంలో ఆవహించింది. అందుకే తాడేపల్లిలో ఏ మాత్రం చడీ చప్పుడూ కనిపించలేదు అని అంటున్నారు.

Tags:    

Similar News