సామాజిక యాత్రలపైనే సర్వ ఆశలు... కానీ...
పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి లక్ష్యాన్ని క్షేత్రస్థాయికి చేరవేస్తున్నారా? అనేది ప్రశ్న.
సామాజిక సాధికార బస్సు యాత్రలపైనే వైసీపీ సర్వ ఆశలు పెట్టుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు మేలు చేశామని.. వారంతా తమతోనే ఉండాలని పిలుపునిస్తూ.. వైసీపీ మంత్రులు, నాయకులు, ఎమ్మల్యేలు ఈ యాత్ర చేపట్టారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్ర.. అన్ని ప్రాంతాల్లోనూ ఒకే విధంగా జరుగుతోందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒకే తాటిపైకి వచ్చి.. పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి లక్ష్యాన్ని క్షేత్రస్థాయికి చేరవేస్తున్నారా? అనేది ప్రశ్న.
నాయకులు కలివిడిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారా? అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. పల్నాడు, గుంటూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం లేదనే అంటున్నారు పరిశీకులు. అంతేకాదు.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బస్సు యాత్రకు బ్రేకులు పడ్డాయనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఇక్కడ ఏమైంది? సామాజిక సాధికార బస్సు యాత్రకు ఎందుకు బ్రేకులు పడ్డాయి? అనే విషయంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది.
తూర్పు విషయానికి వస్తే.. నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటల జోరు ఎక్కువగా ఉంది. పైగా.. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాలు మారాలని భావిస్తున్నవారు.. ఇప్పుడు భారీ ఎత్తున ఖర్చు పెట్టి యాత్రలు చేయడంపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. జనాలను తరలించేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని మెజారిటీ నాయకులు చెబుతున్నారు. లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు. అయినా.. జనాలు రావడం లేదని అంటున్నారు. దీంతో తూర్పులో యాత్రలు మందకొడిగా ఉన్నాయి.
ఇక, గుంటూరు జిల్లాలోని ఒకటి రెండు నియోజకవర్గాల్లో కూడా యాత్రలు సరిగా సాగలేదు. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటలుగా ఉన్న తెనాలి, రేపల్లె, వినుకొండ, గురజాల నియోజకవర్గాల్లో అసలు ఆ ఊసే లేకుండా పోయింది. కేవలం మాచర్లలో మాత్రం ఈ యాత్రలు జరిగాయి. దీంతో అధిష్టానం అలెర్ట్ అయింది. వెంటనే దీనిపై రివ్యూ కండక్ట్ చేసి.. క్షేత్రస్థాయి నాయకులను అలెర్ట్ చేయాలని.. జిల్లా ఇంచార్జ్ మంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. అసలు సమస్య వారితోనే ఉందనేది క్షేత్రస్థాయి నాయకుల మాట. ఎలా చూసుకున్నా.. క్షేత్రస్థాయిలో సామాజిక యాత్రలు ఫలించడం లేదనేది వాస్తవం అంటున్నారు.