ఉసురు తగిలిందా? చాట్ జీపీటీ రూపకర్తను 'సీఈవో' పోస్టు నుంచి పీకేశారు

టెక్ ప్రపంచంలో షాకింగ్ సంచలనం అని చెప్పే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. వ్యక్తుల కంటే సంస్థలు గొప్పవన్న విషయం మరోసారి రుజువైంది

Update: 2023-11-18 04:57 GMT

టెక్ ప్రపంచంలో షాకింగ్ సంచలనం అని చెప్పే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. వ్యక్తుల కంటే సంస్థలు గొప్పవన్న విషయం మరోసారి రుజువైంది. తాను రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ చాట్ జీపీటీ రూపకర్త శామ్ఆల్ట్ మన్ ను సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్ ఏఐ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మైక్రోసాఫ్ట్ ఆర్థిక మద్దతు ఉన్న ఓపెన్ ఏఐ సంస్థ శాల్టమన్ ను నమ్మకపోవటమే దీనికి కారణంగా చెబుతున్నారు.

అతడి స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటీను సీఈవోగా నియమిస్తూ నిర్ణయం తీసుకన్నారు. అల్ట్ మన్ తొలగింపు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. డిజిటల్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారి.. ప్రపంచ గమనాన్ని శాసిస్తుందని చెబుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సత్తా ఎంతన్న విషయాన్ని తెలియజెప్పేలా చాట్ జీపీటీని రూపొందించారు. ఇప్పటికే అందుబాుటలోకి వచ్చిన దీని ప్రభావం ఎంతన్న విషయం ప్రపంచానికి తెలుస్తోంది.

ఇలాంటివేల.. తాజాగా చాట్ జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ బోర్డు మీటింగ్ జరిగింది. ఇందులో ఆల్ట్ మన్ మీద పలుఆరోపణలు చేసింది. 'అతడు సంస్థలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయితీ పాటించటం లేదు. సరైన సమాచారం పంచుకోవటం లేదు. బోర్డు తీసుకునే నిర్ణయాలకు అడ్డుపడుతున్నాడు. ఓపెన్ ఏఐకు నాయకత్వం వహించే అతడి సామర్థ్యం మీద బోర్డుకు ఎంత మాత్రం నమ్మకం లేదు'' అని పేర్కొంటూ అతన్ని సీఈవో పదవి నుంచి తొలగించినట్లుగా పేర్కొంది. ఓపెన్ ఏఐ కంపెనీలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వేలాదికోట్ల రూపాయిల పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.

దీనిపై ఆల్ట్ మన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఓపెన్ ఏఐ సంస్థతో పని చేయటాన్ని తాను ఎంతగానో ఇష్టపడుతున్నట్లుగా పేర్కొన్న ఆయన.. వ్యక్తిగతంగా తాను మారటానికి.. ప్రపంచం కొంచెం మారిందనటానికి తాను నమ్ముతున్నట్లుగా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పని చేసే చాట్ జీపీటీని ఇటీవల కాలంలో పరిచయం చేసినప్పుడు ప్రపంచమే నివ్వెర పోవటం తెలిసిందే. దీని సాయంతో సెకన్ల వ్యవధిలో మనం కోరుకునే సమాచారం ఏదైనా అందించే దీంతో లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. పలు రంగాల్లో ఉద్యోగాలు పోతున్నాయన్న ఆందోళన ఉంది.

చివరకు ఆల్ట్ మన్ సైతం ఏఐతో పెను ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని అంగీకరించటం గమనార్హం. అంతేకాదు.. చాట్ జీపీటీకి మించిన పవర్ ఫుల్ ఏఐను డెవలప్ చేయగల సామర్థ్యం ఉందని.. అయితే.. ఇప్పటికిప్పుడు దాన్ని విడుదల చేసేందుకు తాము సుముఖంగా లేమని ప్రకటించటం సంచలనంగా మారింది. యూజర్లు కూడా అందుకు సిద్ధంగా లేదరన్నారు. ఎందుకంటే.. దీని తర్వాత తలెత్తే పరిణామాలు ఊహించటం కష్టమన్న అతని మాటలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. అలాంటి ఆయన్ను తాజాగా తొలగించటం షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News