"నేను విన్నాను.. నేను వున్నాను"... అంతా బూటకమంట!
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీకి వరుస బ్యాడ్ న్యూస్ లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే!
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీకి వరుస బ్యాడ్ న్యూస్ లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో జగ్గయ్య పేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
అవును... ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత సామినేని ఉదయభాను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 13 ఏళ్లపాటు వైసీపీలో సాగిన ఆయన... జగన్ ఒంటెత్తు పోకడలకు విసిగిపోయి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న ఓ కల్యాణ మండపంలో ఓ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన... తన అభిమానులు, నాయకులు, శ్రేణులు, ప్రజాప్రతినిధుల అంగీకారంతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను చూపారు. ఈ సందర్భంగా తనలోని జనహితమే తనను జనసైనికుడిగా మారేందుకు ప్రేరేపిస్తోందని, తన నాయకత్వాన్ని అభిమానించే వారంతా తనతో కలిసి రావాలని ఈ సందర్భంగా ఉదయభాను పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సానిమేని... వైఎస్సార్ తో ఎంతో సన్నిహితంగా మెలిగిన తాను, ఆయన మీద ఉన్న అభిమానంతో వైసీపీలో చేరినట్లు తెలిపారు. అయితే... వైఎస్సార్ కి, జగన్ కు ఏమాత్రం పోలికలు లేవని సామినేని అన్నారు. జగన్ చుట్టూ కోటరీ తప్ప, పార్టీ కోసం కృషిచేసిన వారికి తగిన గుర్తింపు లేదని అన్నారు.
అయితే.. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం పెట్టుకున్న అర్జీలపై నాడు వైఎస్సార్ వెంటనే స్పందించేవారని అన్నారు. జగన్ కు ఆ అలవాటు లేదని.. ఓటమి తర్వాత కూడా ఆయనలో మార్పు రాలేదని.. అలాంటి అధినాయకత్వం వద్ద ఆత్మాభిమానం చంపుకుని ఇంకా ఉండలేక రాజీనామా చేస్తున్నానని సామినేని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే జగన్ చెప్పే నేను విన్నాను.. నేను ఉన్నాను అనే మాటలు అంతా బోగస్ అని సామినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్లలో జగన్ అపాయింట్మెంట్ కూడా దొరకటం దుర్లభమైందని.. సమస్యలపై విజ్ఞాపనలు ఇస్తే కనీసం సంబంధిత శాఖకు ఎండార్స్ మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదని.. ఇలా ఉన్న అతని వైఖరి వల్లే ఓటమి చెందామని సామినేని తెలిపారు.