టాప్ 10 ఇండియన్ గ్లోబల్ లీడర్లు వీరే.. మొదటి స్థానంలో తెలుగోడు
భారత సంతతికి చెందిన జాబితాలో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ సీఈవో సత్య నాదెళ్ల అగ్రస్థానంలో నిలిచారు.
తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసే జాబితా ఒకటి విడుదలైంది. భారతదేశం వెలువల రాణిస్తున్న భారత సంతతికి చెందిన జాబితాలో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ సీఈవో సత్య నాదెళ్ల అగ్రస్థానంలో నిలిచారు. తర్వాతి స్థానంలో సుందర్ పిచాయ్.. నీల్ మోహన్ తదితరులు ఉన్నారు. తొలిసారి హెచ్ఎస్ బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2024 జాబితాను విడుదల చేసింది.
ఇందులో ప్రపంచంలో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న టాప్ 200 కంపెనీల జాబితాను హురున్ ప్రకటించింది. కనీసం రూ.8600 కోట్ల మార్కెట్ విలువ ఉన్న కంపెనీలను పరిగణలోకి తీసుకుంది. ఈ కంపెనీల మార్కెట్ విలువ కలిపితే 10 లక్షల కోట్ల డాలర్లకు దరిదాపుల్లో నిలిచింది. ఈ 200 సంస్థలకు 226 మంది సీఈవోలు..ఎండీలు.. వ్యవస్థాపకులున్నారు. వీరంతా భారత్ వెలుపల ఉన్న భారతీయ సంతతి వ్యక్తులే. టాప్ 10లో నిలిచిన ప్రముఖుల్ని చూస్తే..
పేరు - సంస్థ
సత్య నాదెళ్ల : మైక్రోసాఫ్ట్
సుందర్ పిచాయ్ : ఆల్ఫాబెట్
నీల్ మోహన్ : యూట్యూబ్
థామస్ కురియన్ : గూగుల్ క్లౌడ్
శంతను నారాయణ్ : అడోబ్
సంజీవ్ లాంబా : లిండే
వసంత నరసింహన్ : నొవార్టిస్
అరవింద్ క్రిష్ణ : ఐబీఎమ్
విమల్ కపూర్ : హనీవెల్
కెవిన్ లోబో : స్టైకర్
టాప్ 10లో తెలుగు ప్రాంతాలకు చెందిన వారు మొత్తం ముగ్గురు ఉండగా.. వారిలో సత్య నాదెళ్ల.. అరవింద్ క్రిష్ణ ఏపీకి చెందిన వారు కాగా.. శంతను నారాయణ్ తెలంగాణకు చెందిన వారిగా పేర్కొన్నారు. మొత్తం200 మందిలో ఐటీ రంగానికి చెందిన వారు 87 మంది ఉంటే.. ఆర్థిక సేవలకు చెందిన రంగాలకు 24 మంది.. ఆరోగ్య సంరక్షణ రంగంలో 21 మంది ఉన్నారు. ఈ 200 మందిలో 79 శాతం (172 మంది) ఉండగా.. బ్రిటన్ లో 5 శాతం (11 మంది).. యూఏఈలో 4 శాతం (9 మంది) ఉన్నారు. ఈ 200 మందిలో అత్యధికంగా కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 92 మంది కాలిఫోర్నియాలో ఉండగా.. న్యూయార్క్ లో 17 మంది ఉన్నారు. మాసాచుసెట్స్ 9 మంది.. టెక్సాస్ లో 9 మంది.. వాష్టింగ్టన్ లో ఆరుగురు ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది.
ఈ నివేదికలో పేర్కొన్న ముఖ్యాంశాల్ని చూస్తే..
- అత్యంత ప్రభావవంత మహిళగా ఛానల్ గ్లోబల్ సీఈవో లీనా నాయర్ నిలిచారు.
- జాబితాలో ఉన్న 101 మంది ప్రవాసులు హురున్ గ్లోబల్ ఇండియన్స్ రిచ్ లిస్టులో ఉన్నారు. అందులో మిత్తల్ ఫ్యామిలీ మెంటర్లు రూ.1.84 లక్షల కోట్ల సంపదతో తొలి స్థానంలో ఉన్నారు. గోపీచంద్ హిందుజా కుటుంబీకులు రూ.1.78 లక్షల కోట్లతో తర్వాతి నిలిచారు. రూ.31,100 కోట్ల సంపదతో అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి తొమ్మిదో స్థానంలో ఉన్నారు.
- అత్యంత పిన్న వయస్కుడిగా కమ్యూర్ సహ వ్యవస్థాపకుడు కం సీఈవో తనయ్ టాండన్ (27 ఏళ్లు) నిలిచారు.
- జాబితాలో మొత్తం వాల్యూలో అగ్రగామి 10 మంది నిర్వహిస్తున్న కంపెనీలవాటానే 73 శాతంగా ఉంది. జాబితాలోని వారిలో 57 శాతం మంది తొలితరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే. మిగిలిన వారు వ్రత్తి నిపుణులు.. వారసులు. ఈ జాబితాలో 12 మంది మహిళలు ఉన్నారు.
- మొత్తం జాబితాలో 62 శాతం మంది భారత్ లో అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన వారే. 77 శాతం మంది అమెరికాలో పీజీ చేశారు. అండర్ గ్రాడ్యుయేషన్ లో ఐఐటీ మద్రాస్ నుంచి 14 మంది ఉన్నారు. పీజీ విషయంలో స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో చదివిన వారు 20 మంది ఉన్నారు.