కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు

గుట్టుగా కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని నిర్వహిస్తున్న ఒక ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు.

Update: 2025-01-22 05:26 GMT

గుట్టుగా కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని నిర్వహిస్తున్న ఒక ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ తోపాటు కొందరు ఉద్యోగులను మొదట పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మరిన్ని ఆధారాలతో ఆసుపత్రిని సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాదు నగర పరిధిలోని అల్కానంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేస్తా చికిత్సలు నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి.

కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలి. ఆరోగ్యశాఖ అనుమతులు లేకుండా ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తుండడం పట్ల పలువురు పోలీసులు కూడా ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు నేపథ్యంలో రాచకొండ పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తు గొలుపే నిజాలు వెలుగు చూశాయి. ఇతర రాష్ట్రాల నుంచి కిడ్నీ దాతలను రప్పించడంతోపాటు రాష్ట్రంలోని వైద్యులను కూడా పిలిపించి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను చేయిస్తున్నట్లు గుర్తించారు. ఇందుకోసం లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ అడ్డగోలు వ్యవహారాల ద్వారా కోట్లాది రూపాయలను ఆసుపత్రి యాజమాన్యం గడించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కిడ్నీ మార్పిడి చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు దానం చేసిన కిడ్నీలను కర్ణాటకకు చెందిన ఇద్దరు రోగులకు అమర్చినట్లు పోలీసులతోపాటు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. పోలీసులు కిడ్నీ దాతలు, రోగులను అంబులెన్స్ లో సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేవలం ఆరు నెలల క్రితమే ఆసుపత్రిని ప్రారంభించారు. ఇద్దరు వైద్యులతో మైనర్ సర్జరీలు చేసేందుకు ఈ ఆసుపత్రికి అనుమతి ఉంది. ఆసుపత్రి నిర్వహణకు తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా కిడ్నీ మార్పిడి వంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండడంతో పోలీసులు ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించి గుట్టు రట్టు చేశారు. ఈ ఆస్పత్రిపై దాడులు నిర్వహించిన అధికారులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సరూర్ నగర్) కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి వెంకటేశ్వరరావుతోపాటు ఇతర అధికారులు ఉన్నారు. ఈ వ్యవహారంలో ఆస్పత్రి ఎండి సుమంత్ చారి, మరి కొంతమంది సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఫిర్యాదు మేరకు సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ ఆసుపత్రికి అందించిన అనుమతులు వివరాలను వెల్లడించారు. తొమ్మిది పడకలతో సాధారణ వైద్యశాల అందించేందుకు మాత్రమే అనుమతి ఉందని, కానీ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదులతో ఈ దాడులు నిర్వహించి అసలు విషయాన్ని గుర్తించామన్నారు. ఈ వ్యవహారంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో తనిఖీలు కోసం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ సమర్థవంతంగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు.

Tags:    

Similar News