సౌదీలో ఘోరం... హైదరాబాదీ మహిళపై పాకిస్థానీ భర్త చిత్రహింసలు!

దేశం ఏదైనా.. ప్రాంతం మరేదైనా.. రోజులు ఏవైనా.. మహిళలపై జరుగుతున్న దాడులు మాత్రం ఆగడం లేదు! ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని హైదారాబాదీ మహిళను ఆమె భర్త తీవ్రస్థాయిలో వేదించడం మొదలుపెట్టాడు.

Update: 2024-03-10 14:30 GMT

దేశం ఏదైనా.. ప్రాంతం మరేదైనా.. రోజులు ఏవైనా.. మహిళలపై జరుగుతున్న దాడులు మాత్రం ఆగడం లేదు! ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని హైదారాబాదీ మహిళను ఆమె భర్త తీవ్రస్థాయిలో వేదించడం మొదలుపెట్టాడు. అవి తాళలేక ఆమె తన ముగ్గురు పిల్లలతో సహా ఇంటి నుంచి పారిపోయి ఓ హోటల్ లో తలదాచుకుంది. దీంతో ఈమె పరిస్థితిపై కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు కుటుంబ సభ్యులు.

అవును... సౌదీ అరేబియాలో భర్త వేధింపులు తాళలేక తన ముగ్గురు పిల్లలతోపాటు... తన భర్త రెండోపెళ్లి చేసుకున్న 17 ఏళ్ల బాలికను కూడా వెంటపెట్టుకుని పారిపోయి ఓ హోటల్ లో తలదాచుకొంది హైదరాబాదీ మహిళ సబాబేగం. దీంతో ఈ విషయం హైదరాబాద్ లో ఉన్న తన తల్లికి చెప్పడంతో... తన కూతురు, మనవరాళ్లు, మనవడిని భారత్ కు రప్పించాలని కోరుతూ ఆమె కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు.

ఇదే విషయాలను హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఎంబీటీ అధికార ప్రతినిధి తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ వివరాల ప్రకారం... హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ కు చెందిన సబేరా బేగం కుమార్తె సబాబేగంకు గతంలో వివాహం కాగా... కట్న ఇవ్వలేదనే కారణంతో ఆమెను భర్త వదిలేశాడు. దీంతో ఆమెకూ మరో వివాహం చేయాలని తల్లితండ్రులు ప్రయత్నించేవారు. ఈ క్రమంలో వారి ఇంటి సమీపంలో నివసించే ముఖ్తాదీర్... బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి అంటూ అలీ హుస్సేన్ అజీజ్ ఉల్ రెహ్మాన్ ను వారికి పరిచయం చేశాడు.

ఈ క్రమంలో ఇరువురూ మాట్లాడుకున్న తర్వాత... మక్కాలో డ్రైవర్లుగా పనిచేసే ముఖ్తాదీర్, అలీ హుస్సేన్ లతోపాటు సబాబేగంను సౌదీకి పంపించారు. ఈ క్రమంలో 2014 ఫిబ్రవరిలో అలీ హుస్సేన్.. సబాబేగంను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరికి ఇద్దరు కుమర్తెలు, ఒక కుమారుడు సంతానం కలిగారు. కాలం ఇలా సాగుతున్న క్రమంలో... అలీ హుస్సేన్ తన భార్యను వేదించడం మొదలుపెట్టాడు.

అక్కడితో ఆగకుండా... ఈ మధ్యకాలంలో 17ఏళ్ల బాలికను బంగ్లాదేశ్ నుంచి కొనుగోలు చేసి రెండోవివాహం కూడా చేసుకున్నాడు. ఆమెను సౌదీకి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ బాధలు భరించలేక.. ముగ్గురు పిల్లలతో పాటు తన భర్త రెండో వివాహం చేసుకున్న బాలికను వెంటపెట్టుకుని ఒక హోటల్ లో తలదాచుకుంటూ.. హైదరాబాద్ లో ఉన్న తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది సబాబేగం.

ఇదే సమయంలో... తనను వివాహం చేసుకున్న వ్యక్తి పాకిస్థాన్ జాతీయుడనే విషయం అతడి పాస్ పోర్ట్ ద్వారా తేలిందని తెలిపింది. ఈ క్రమంలో ఇప్పటికే సౌదీలోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులు సబాబేగంను సంప్రదించారని తెలుస్తుంది. ఒకటి రెండు రోజుల్లో ఆమెను కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడి.. తదుపరి చర్యలు తీసుకుని అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News