కృష్ణానదిలో సీప్లేన్ సర్వీసులు... ఇవిగో పూర్తి వివరాలు!
ఏపీలో టూరిజం రంగానికి ఊతమిచ్చేలా ఈ సర్వీసులు ఉండబోతున్నాయనే చర్చ మొదలైంది.
ఏపీలో కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత మార్పు మొదలైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కామెంట్లకు బలం చేకూర్చే కార్యక్రమాల సరసన తాజాగా కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు అనే అంశం వచ్చి చేరింది. ఏపీలో టూరిజం రంగానికి ఊతమిచ్చేలా ఈ సర్వీసులు ఉండబోతున్నాయనే చర్చ మొదలైంది.
అవును... ఏపీలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా కృష్ణానదిలో సీప్లే సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి... విజయవాడ నగరంలో సీప్లేన్ సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కొద్ది నెలల క్రితమే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
ఈ క్రమంలో విజయవాడకు పర్యాటకంలో ఉండే అనుకూలతల నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రానికి తొలి సర్వీసుల్ని ప్రారంభించాలని నిర్ణయించారు. డిసెంబర్ 9 నుంచి ఈ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభిస్తారని అంటున్నారు!
ఇక, ఈ ప్రాజెక్టులో భాగంగా సీ ప్లేన్ లోకి రాకపోకలు సాగించేందుకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఓ వాటర్ ఏరో డ్రమ్ ను ఏర్పాటు చేస్తారు. దీనికోసం ఇప్పటికే అధికారులు సర్వే చేపట్టారు. ఈ సమయంలో... శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం దిగువున ఉన్న ప్రాంతంలో ఈ వాటర్ డ్రోమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
ఈ సీ ప్లేన్ సర్వీసుల ద్వారా విజయవాడ - శ్రీశైలం పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం మరింత సులభం కానుంది. విజయవాడలోని స్రీ దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకుని, శ్రీ శైలంలోని శ్రీభ్రమరాంబ సమేత మల్లిఖార్జులను దర్శించుకునే భాగ్యం ఈ నూతన సర్వీస్ కలిస్తుందని అంటున్నారు.
ఇదే సమయంలో ఈ రెండు ప్రాంతాల మధ్య టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చెందుతూందని అంచనా వేస్తున్నారు. ఇది విజయవంతం అయితే.. భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య... హుస్సేన్ సాగర్ టు విశాఖ కు ఈ సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.