ఎవరీ సురేష్ ..?

అయితే కాంగ్రెస్ అంతలా పట్టుబడుతున్న ఈ సురేష్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ప్రొటెం స్పీకర్ గా మొదట సురేష్ పేరు వినిపించింది.

Update: 2024-06-26 03:48 GMT

లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఈ సారి ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఫలించలేదు. డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఇవ్వాలన్న షరతుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో స్పీకర్‌ స్థానానికి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది. ఎన్డీయే కూటమి తరఫున మాజీ స్పీకర్‌ ఓం బిర్లా పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి తరఫున సీనియర్‌ ఎంపీ కొడికున్నిల్‌ సురేశ్‌ బరిలో నిలిచారు. దీంతో గత 50 ఏండ్లలో తొలిసారిగా, స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరుగనున్నది.

అయితే కాంగ్రెస్ అంతలా పట్టుబడుతున్న ఈ సురేష్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ప్రొటెం స్పీకర్ గా మొదట సురేష్ పేరు వినిపించింది. అయితే ఆయనను కాదని ఎన్డీఎ భర్తృహరి మహతాబ్‌ వైపు మొగ్గు చూపడంతో కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటుకు అత్యధిక సార్లు ఎన్నికైన వారిని ప్రొటెం స్పీకర్ గా నియమించడం ఆనవాయితీ.

కొడికొన్నిల్‌ సురేష్‌ మొదట 1989, 1991, 1996, 1999 ఎన్నికలలో కేరళలోని ఆదూర్ నియోజకవర్గం నుండి వరసగా నాలుగు సార్లు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 2009, 2014, 2019, 2024 ఎన్నికలలో మాలికవేర నియోజకవర్గం నుండి విజయం సాధించాడు. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు లోక్ సభకు ఎన్నికయ్యాడు.

భర్తృహరి మహతాబ్‌ ఒడిశాలోని కటక్ లోక్ సభ స్థానం నుండి 1998 నుండి వరసగా ఆరుసార్లు బీజేడీ తరపున, ఇప్పుడు ఏడోసారి బీజేపీ తరపున ఎన్నికయ్యాడు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న సురేష్ కోసం 50 ఏళ్ల తర్వాత లోక్ సభ స్పీకర్ పదవికి పోటీ పడుతుండడం విశేషం.

Tags:    

Similar News