శంషాబాద్ ఎయిర్ పోర్టులో సరికొత్త బ్యాగేజ్ డ్రాప్ సేవలు

అయితే.. ఈ సేవలు కేవలం ఎయిరిండియా.. విస్తారా.. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు మాత్రమే ఉండటం గమనార్హం.

Update: 2024-09-10 08:30 GMT

అంతకంతకూ తన సేవల పరిధుల్ని విస్తరించుకుంటూ వెళుతోంది శంషాబాద్ ఎయిర్ పోర్టు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు సరికొత్త సదుపాయాన్ని అందించే ఏర్పాట్లు చేశారు. అయితే.. ఈ సేవలు కేవలం ఎయిరిండియా.. విస్తారా.. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు మాత్రమే ఉండటం గమనార్హం. సాధారణంగా ప్రయాణికులు తమతో తెచ్చుకునే బ్యాగేజీని డిపార్చర్ లెవల్ వరకు తీసుకెళ్లటం.. అక్కడి ఎయిర్ లైన్స్ సంస్థల కౌంటర్లలో అప్పజెప్పటం తెలిసిందే.

దీని కారణంగా క్యూలైన్లు ఆలస్యంగా కదులుతూ.. ప్రయాణికులకు ఆలస్యం అవుతున్న పరిస్థితి. దీన్ని అధిగమించేందుకు ఎయిరిండియా ఒక కొత్త సేవల్ని చేపట్టింది. దీని ప్రకారం లగేజీని తీసుకొన్న తర్వాత వాహనాల పార్కింగ్.. అదేనండి బస్టాండ్ సమీపంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఎయిరిండియా కౌంటర్ లోనే ఇచ్చేసే వీలుంది. ప్రయాణికులు తమ విమానం బయలుదేరటానికి గరిష్ఠంగా ఆరు గంటల ముందు.. కనిష్ఠంగా 90 నిమిషాల ముందు ఇక్కడ చెకిన్ బ్యాగులు తీసుకుంటారు.

ఇలా బ్యాగుల్ని పార్కింగ్ స్లాట్ వద్దే ఇచ్చేయటం వల్ల ప్రయాణికులకు భారం అక్కడే తగ్గిపోతుంది. అంతేకాదు.. చెక్ ఇన్ ప్రక్రియ కూడా సులువు అవుతుంది. టైం కూడా మిగులుతుంది. ఇదే ఎయిరిండియా శంషాబాద్ ఎయిర్ పోర్టులో లగేజ్ కు సంబంధించి మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టులో సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ మెషీన్లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా బ్యాగేజీ అప్పగింత ఆలస్యం కాకుండా..మరింత సమయం ఆదా కానుంది. ఇదే సౌకర్యాన్ని ఇండిగో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News