తెనాలి బస్సులో వైఎస్ షర్మిళ హల్ చల్... వీడియో వైరల్!

ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో మాట్లాడారు.

Update: 2024-10-18 11:51 GMT

గతకొంతకాలంగా మౌనంగా ఉన్నట్లు కనిపించిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తాజాగా ఏపీలోని బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెతో పలువురు సెల్ఫీలు తీసుకోగా.. ప్రయాణికులందరితో ఆమె ఫోటోలు దిగారు! ఈ సందర్భంగా ఉచిత బస్సు హామీపై కీలక ప్రశ్నలు సంధించారు.

అవును... ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ శుక్రవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఇందులో భాగంగా... విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి వెళ్లే బస్సులో ప్రయాణించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా స్పందించిన షర్మిళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... విజయవాడ బస్టాండు నుంచి తెనాలి వరకూ బస్సులో తోటి మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా... చంద్రబాబు వచ్చి నాలుగు నెలలు అయ్యింది.. అయినా ఉచిత బస్సు ప్రయాణంపై ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదు.. కానీ, తెలంగాణలో వారంలోనే అమలు చేశారు అని అన్నారు.

ఇదే క్రమంలో కర్ణాటకలోనూ అమలు చేస్తున్నారని చెప్పిన షర్మిళ... "మీకు మాత్రం ఈ పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటి..?" అని ప్రశ్నిస్తూ... "రాష్ట్రంలో ప్రతీరోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తుంటే.. రోజూ ఈ మహిళల ద్వారా రూ.7-10 కోట్లు, అంటే నెలకు రూ.300 కోట్ల వరకూ ఆదాయం వస్తుంది" అని అన్నారు.

అయితే... "మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే అంత సొమ్ము ఆర్టీసీకి కట్టాలని భయమా?" అని ప్రశ్నించిన షర్మిళ.. మహిళల చేత ఓట్లు వెయించుకున్నారు.. ఇప్పుడు ఆ మహిళల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయలేరా అని అడిగారు. ఇదే సమయంలో... సూపర్ సిక్స్ హామీల ప్రస్థావన తెచ్చిన ఆమె.. అందులో నాలుగు మహిళలవే అని తెలిపారు.

వీటన్నింటిలోనూ ఉచిత ప్రయాణం ఒక్కటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది.. అయినప్పటికీ ఈ పథకాన్ని అమలు చేయడానికి ధైర్యం రావాడం లేదా..? ఇదే అమలు చేయనప్పుడు ఇక మిగిలిన పెద్ద పథకాల సంగతి ఏమిటి..? ఈ ఐదేళ్లు ఇలానే కాలయాపన చేస్తారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇదే క్రమంలో... ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు భద్రత ఉంటుందని చెప్పిన షర్మిల.. ఇది మంచి పథకమని, వెంటనే ఉచిత ప్రయాణం అమలు చేయాలని చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాన్నని అన్నారు. ఈ సందర్భంగా... మహిళల భద్రత విషయంలో ముందడుగు పడాలని చంద్రబాబుకు పోస్ట్ కార్డు పంపిస్తున్నట్లు తెలిపారు షర్మిళ.

అదే సమయంలో... రాబోయే రెండు మూడు రోజుల్లో చంద్రబాబుకు పెద్ద ఎత్తున పోస్ట్ కార్డులు పంపిస్తామని.. ఇది చూసైనా చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరుపున హెచ్చరిస్తున్నట్లు షర్మిళ తెలిపారు!

Tags:    

Similar News