చంద్రబాబు ఇచ్చిన హామీలపై షర్మిల కీలక వ్యాఖ్యలు!

ఈ హామీల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్స్ పెంచిన చంద్రబాబు.. ఎలక్షన్ కోడ్ లోని నెలలకు సంబంధించిన ఏరియర్స్ కూడా అందచేశారు.

Update: 2025-01-25 12:34 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలు "సూపర్ సిక్స్".. కూటమి విజయంలో ఏ స్థాయిలో కీలక భూమిక పోషించిందనేది తెలిసిన విషయమే. ఈ హామీల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్స్ పెంచిన చంద్రబాబు.. ఎలక్షన్ కోడ్ లోని నెలలకు సంబంధించిన ఏరియర్స్ కూడా అందచేశారు. చిత్తశుద్ధిని చాటుకున్నారని అంటారు.

మరోపక్క ఇటీవల ఏడాదికి మూడు ఉచిత సిలెండర్లు పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు ఆ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు. మిగిలిన హామీల విషయంలో గ్రౌండ్ వర్స్క్ జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. సూపర్ సిక్స్ హామీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఓ రియల్ ఎస్టెట్ కంపెనీ తమ వెంచర్ కి సంబంధించి ఎలాగైతే ఓ బ్రోచర్ ప్రింట్ చేసి మార్కెటింగ్ చేస్తుందో.. అదే తరహాలో ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా సూపర్ సిక్స్ హామీల బ్రోచర్ ప్రింట్ చేసి పంచారని.. ప్రజలు నమ్మి ఓట్లు వేశారని.. చంద్రబాబు సీఎం అయ్యారని.. కానీ ఏరు దాటాక బోడి మల్లన్న పరిస్థితి అయిపోయిందని అన్నారు.

ప్రతీ రైతుకీ ఏడాదికి రూ.20 వేల చొప్పున ఇస్తామని చెప్పారని.. స్కూలుకు వెళ్లే బిడ్డలకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారని.. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ రూ.15 వందలు ప్రతినెలా ఇస్తామని అన్నారని.. 20 లక్షల ఉద్యోగాలు లేదా రూ.3,000 నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామన్నారు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారని గుర్తు చేశారు.

ఈ సమయంలో... ‘అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయినప్పటికీ మీరు హామీలు ఎందుకు అమలు చేయలేదు.. ఈ విషయాలపై ప్రజలకు ఏమి చెబుతారు’ అని ప్రశ్నించిన షర్మిల... ‘జగన్ జమానాలో చేసిన మోసాలను సరిచేస్తామని చెప్పి ఇప్పుడు మీరు కూడా పేదలను మోసం చేశారు’ అని మండిపడ్డారు! ఇదే సమయంలో... మెగా డీఎస్సీని షర్మిల గుర్తు చేశారు.

Tags:    

Similar News