జగన్ ని విమర్శించకపోతేనే తనకు లాభమట... షర్మిల కీలక వ్యాఖ్యలు!
ఈ విషయంలో వ్యవహారం ఎవరూ ఊహించని రీతిగా అన్నట్లుగా.. మూడు లేఖలు, ఆరు ప్రెస్ మీట్లు, తొమ్మిది విమర్శలు అన్నట్లు సాగింది.
వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకాల వ్యవహారం తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వ్యవహారం ఎవరూ ఊహించని రీతిగా అన్నట్లుగా.. మూడు లేఖలు, ఆరు ప్రెస్ మీట్లు, తొమ్మిది విమర్శలు అన్నట్లు సాగింది. ఈ వ్యవహారంపై తీవ్ర దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు.. ఆయన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు మధ్య ఆస్తి తగాదాల వ్యవహారం తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. పైగా వీరిద్ధరి మధ్య సాగిన లేఖలు టీడీపీ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ అవ్వడం, దానికి ముందు ఆ పార్టీ బిగ్ బ్లాస్ట్ అంటూ ఉత్సుకత రేకెత్తించి మరీ వదిలిన పరిస్థితి.
దీంతో... కుటుంబంలో నాలుగు గోడల మధ్య సాగాల్సిన వ్యవహారం కాస్తా రోడ్డెక్కింది.. రాజకీయ విమర్శలకూ దారి తీసింది. దీనికి కారణం ఎవరు అనే సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా ఈ వ్యవహరంపై షర్మ్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఆస్తులు ఇవ్వడానికి జగన్ కండిషన్ పెట్టారా? అనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ సందర్భంగా స్పందించిన షర్మిల... "వాస్తవానికి నేను జగన్ మోహన్ రెడ్డి గురించి ఇలా మాట్లాడకపోతే.. ఆయన అవినీతి ఎత్తి చూపకపోతే.. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే నా ఆస్తి నాకు ఇచ్చేస్తానంటున్నారు.. నిజానికి నాకు మాట్లాడకపోతేనే లాభం.. కానీ మాట్లాడటం నా బాధ్యత" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో... "నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని.. ఇది నా విధి.. మాట్లాడటం నా బాధ్యత కాబట్టి పనిగట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తాం.. కానీ, అప్పటి ప్రభుత్వానికి కూడా జగన్ ఇలాంటి అవినీతి బయటపడినప్పుడు మాట్లాడటం మా విధి" అని అన్నారు.
దీంతో.. రెండు రకాల అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... తనపై రాజకీయంగా, వ్యక్తిగతంగా విమర్శలు చేయకపోతే జగన్ తనకు ఆస్తి ఇస్తానని చెప్పారా..? అనేది ఒకటిగా ఉంది. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడక పోతే నా ఆస్తి నాకు ఇచ్చేస్తానంటున్నారని షర్మిల చెప్పిన వ్యాఖ్యల వెనుక పరమార్థం ఇదే అని అంటున్నారు.
మరోపక్క.. ఏపీ పీసీసీ చీఫ్ అవ్వడం వల్ల మాట్లాడటం తన విధి అని అంటే... తాను కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిని కాబట్టి ఇలా మీడియాకు ఎక్కి మాట్లాడటం జరుగుతుంది అని.. లేకపోతే తనకు అవసరం లేదు అన్నట్లుగా షర్మిల చెప్పాలనుకుంటున్నాట్లున్నారనేది మరొకటి అని చెబుతున్నారు. మరి.. అన్నా చెల్లెల్లి ఆస్తుల పంపకాల వ్యవహారం ఎప్పటికి కొలిక్కి వస్తుందో అంటూ వేచి చూస్తున్నారు వైఎస్ ఫ్యామిలీ ఫ్యాన్స్!!