షర్మిల పనికి రాదా ?
అదేమి ఖర్మమో ఏపీ కాంగ్రెస్ కి దశాబ్దంగా చెడ్డ రోజులే నడుస్తున్నాయి.
అదేమి ఖర్మమో ఏపీ కాంగ్రెస్ కి దశాబ్దంగా చెడ్డ రోజులే నడుస్తున్నాయి. ఇక మీదట కూడా ఏపీలో హస్తం పార్టీ ఎత్తిగిల్లే సూచనలు అయితే కనిపించడం లేదు. వైఎస్సార్ వారసురాలు అని షర్మిలను తెచ్చి పెట్టినా నానాటికీ తీసికట్టు గానే కాంగ్రెస్ పరిస్థితి ఉంది.
ఇక షర్మిల ఎకాఎకీన కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఎంత ఏపీలో పార్టీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. దానికి విధానాలు కొన్ని ఉంటాయి. అలాంటి పార్టీలో షర్మిల ఇలా చేరి అలా పీసీసీ చీఫ్ అయిపోయారు. ఇక పార్టీ పదవులో ఉన్న ఆమె ఎవరికీ కలుపుకుని పోవడం లేదు అని అంటున్నారు.
దాంతో పార్టీని నమ్ముకుని మొదటి నుంచి ఉన్న వారు చాలా మంది ఉన్నారు. వారిలో కేంద్ర మంత్రులుగా చేసిన వారు ఉన్నారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. వీరందరూ కూడా షర్మిల పనితీరు పట్ల ఆమె ఒంటెద్దు పోకడల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది.
అంతే కాదు సీనియర్లు పార్టీకి దూరంగా ఉంటున్నారు అని టాక్ నడుస్తోంది. కేవలం షర్మిల వల్లనే సీనియర్లు పనిచేయడం లేదు అని అంటున్నారు. షర్మిల జగన్ ఈ ఇద్దరూ ఒకే తానుకు రెండు ముక్కలు లాంటి వారు అని అంటున్నారు. ఈ ఇద్దరి స్వభావాలూ ఒకేలా ఉంటాయని వారి వైఖరితో సర్దుకుని పోయి పని చేయడం కష్టమని అంటున్నారుట.
ఇదే విషయాన్ని కొందరు సీనియర్లు ఇటీవల కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని కలసి కూడా చెప్పారని ప్రచారం సాగుతోంది. వైఎస్సార్ వారసత్వం, ఆయన లెగసీ అని షర్మిలను తెచ్చి పెట్టినా ఆమెకు ఆ రాజకీయ వారసత్వం లేదని జనాలు కూడా ఆమెను అలా గుర్తించడం లేదని అంటున్నారు.
వైఎస్సార్ రాజకీయ వారసుడిగా జగన్ ఆల్ రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారని ఆయనకే జనాలు ఓటేశారు అన్నది కూడా వారు కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి చెప్పారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని ఆమెను పార్టీ పెద్దగా ఉంచడం వల్ల రాజకీయంగా నష్టం తప్ప లాభం రాదు అని చెప్పారని తెలుస్తోంది.
ఆమెను పీసీసీ చీఫ్ గా ఉంచితే పార్టీ ఏ మాత్రం ఎదగదు అని ఖరాఖండీగా చెప్పారని అంటున్నారు. ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీ విధానాలను జనంలోకి తీసుకుని వెళ్ళి ప్రచారం చేయడం లేదని ఆమె తన వ్యక్తిగత అజెండానే పార్టీ మీద పెడుతోంది అని అంటున్నారు. ఆమెకు జగన్ కి మధ్య ఉన్న వివాదాలనే ఆమె పట్టించుకుని ఆ కోణంలోనే మాట్లాడుతోందని కూడా సీనియర్లు కాంగ్రెస్ పెద్దల దృష్టికి తెచ్చారని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఏపీలో అధికారం చేతులు మారింది. ఇపుడు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది. కానీ షర్మిల మాత్రం అధికార కూటమిని వదిలేసి వైసీపీని జగన్ ని టార్గెట్ చేయడాన్ని కూడా వారు పెద్దలకు చెప్పారని అంటున్నారు. జగన్ మీద కోపంతో షర్మిల కాంగ్రెస్ ని బలి పెడుతున్నారు అని కూడా వారు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయం సీనియర్లు పూర్తి స్థాయిలో అంతర్మధనం చెందుతున్నారు.
ఇక ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి పట్ల కూడా సీనియర్లు కలత చెందుతున్నారు. ఇప్పటికి మూడు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ దారుణంగా ఓడిందని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పట్లో కాంగ్రెస్ ఏపీలో అధికారంలోకి రాదు అని కూడా సీనియర్లు డిసైడ్ అయ్యారని అంటున్నారు.
ఏపీకి పవర్ ఫుల్ లీడర్ ఒక మాస్ లీడర్ నాయకత్వం వహిస్తే ఏమో కానీ ఇపుడున్న పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం కష్టమని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే సీనియర్లు షర్మిల వైఖరితో గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఆమె వల్ల కాంగ్రెస్ గ్రాఫ్ ఏ మాత్రం పెరగకపోతే మరింత కునారిల్లుతోంది అని అంటున్నారు.
షర్మిల ఏపీలో టీడీపీ కూటమి వైఫల్యాలను అసలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. తాజాగా బెజవాడ నీట మునగడం వెనక ప్రభుత్వం అలెర్ట్ కాకపోవడం ఒక కారణం అని ఉన్నా కూడా షర్మిల ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరించడమే కాకుండా వైసీపీ మీదనే విమర్శలు చేయడాన్ని కూడా సీనియర్లు గుర్తు చేసుకుంటున్నారుట.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏమీ బలపడలేదని వారు అంటున్నారు. జనవరి లో షర్మిల పార్టీ బాధ్యతలు స్వీకరించారు. ఎనిమిది నెలలు పూర్తి అయింది. కానీ షర్మిల ఫక్తు కాంగ్రెస్ లీడర్ గా మారలేకపోయారని పార్టీకి నాయకత్వం వహిస్తున్న లీడర్ గా వ్యవహరించలేకపోతున్నారు అని కూడా అంటున్నారు. మొత్తానికి షర్మిల విషయంలో కాంగ్రెస్ సీనియర్లు అయితే ఆమె వల్ల ఏమీ కాదనే తేల్చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.