ఏపీలోనూ కోతలు.. తెలంగాణలో నియంతను దించేసిందట?
రెండున్నరేళ్ల కిందట తెలంగాణలో అనూహ్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అంటూ సొంతంగా పార్టీని నెలకొల్పారు వైఎస్ షర్మిల.
సంబంధం లేకున్నా.. తగుదున్నమా అంటూ తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చి.. పాదయాత్ర.. నిరుద్యోగ దీక్షలంటూ హడావుడి చేసి.. పోటీ చేసేందుకు సీటునూ ప్రకటించి.. తీరా ఎన్నికల సమయంలో చేతులెత్తేసిన నాయకురాలు ఇప్పుడు తెలంగాణలో నియంతను తానే దించేశానంటూ బీరాలు పలుకుతోంది. అసలు ఆమె పొరుగు రాష్ట్ర రాజకీయాల్లోకి ఎందుకొచ్చారు..? మంచి ఉద్దేశం ఉన్నప్పుడు పార్టీని ఎందుకు వదిలేశారు..? ఇప్పుడు సొంత రాష్ట్ర రాజకీయాల్లోకి ఎందుకు వేలు పెడుతున్నారు..? ఎవరికీ అర్థంకాని పరిస్థితి.
తెలంగాణలో బీరాలు పోయి
రెండున్నరేళ్ల కిందట తెలంగాణలో అనూహ్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అంటూ సొంతంగా పార్టీని నెలకొల్పారు వైఎస్ షర్మిల. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంపై కాలుదువ్వారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష అంటూ దీక్షలకు దిగారు. పాదయాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్లారు. పాలేరు నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. అక్కడ క్యాంపు కార్యాలయాన్నీ నెలకొల్పారు. తీరా.. ఎన్నికల సమయం వచ్చేసరికి వైటీపీని కాంగ్రెస్ లో కలిపేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి మరీ ఆ తతంగం పూర్తి చేశారు. కొద్ది రోజుల కిందటనే ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు.
విభజన పాపాన్ని మోసే కాంగ్రెస్ ను మోస్తూ..
అడ్డగోలుగా ఉమ్మడి ఏపీ విభజన పాపం ముమ్మూటికీ కాంగ్రెస్ దే. అయితే, ఇందులో బీజేపీది సమాన పాత్ర. ఈ పాపాన్ని మరో వందేళ్లయినా మోయాల్సిన కాంగ్రెస్ ను భుజాన మోసేందుకు షర్మిల సిద్ధమయ్యారు. అంతేకాదు.. సొంత అన్న కాదనుకుని వచ్చిన పార్టీని.. అది కూడా ఆయన అధికారంలో ఉండగా తలకెత్తుకున్నారు. ఇందులో మర్మం ఏమిటో ఆమెకే తెలియాలి. ఇక ఆదివారం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరీ విచిత్రంగా ఉన్నాయి.
నియంతను ఆమె దించితే.. మరి రేవంత్?
తెలంగాణలో అసలు పోటీనే చేయకుండా ఉన్న షర్మిల.. ఇక్కడి నియంత పరిపాలనకు అంతం పలికానని చెబుతున్నారు. తద్వారా తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు తన వంతు పాత్ర పోషించానని చెప్పుకొనే ప్రయత్నం చేశారు. ఇది వినేందుకు విచిత్రంగా అనిపించిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అసలు తెలంగాణలో కేసీఆర్ సర్కారును పడగొట్టడంలో కీలక పాత్ర రేవంత్ రెడ్డిదే. రెండున్నరేళ్ల కిందట సరిగ్గా షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించిన సమయంలోనే రేవంత్ తెలంగాణ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి కాంగ్రెస్ కు అసలు ఊపే లేదు. అలాంటిది ఎన్నికల సమయానికి పార్టీని ప్రభావవంతమైన శక్తిగా మార్చారు. ఎన్నికల్లో కేసీఆర్ వంటి నాయకుడిని ఢీకొట్టి కాంగ్రెస్ ను గెలిపించారు. ఇది అందరికీ తెలిసిన చరిత్ర అయితే.. నియంతను దించానంటూ షర్మిల వ్యాఖ్యానించడం కోతలు కోయడమేనని పరిశీలకులు అంటున్నారు. ఈ పేరిట ఆమె ఏపీ రాజకీయాల్లో ఫాయిదా పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.