కేటీఆర్ భయపడ్డారా.. ఆయన వ్యాఖ్యల పరామర్థం ఏంటి..?
పార్టీని నడిపించాల్సిన నాయకుడే వెనకడుగు వేసినట్లుగా కామెంట్లు చేయడంపై పలురకాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు సింహంలా కనిపించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్కసారిగా భయపడిపోయారా..? నిన్న ఆయన తీసుకున్న యూటర్న్ అందులోభాగమేనా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే.. సొంత పార్టీ కేడర్ నుంచే ఇలాంటి అనుమానాలు వినిపిస్తుండడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేటీఆర్ ఒక్కసారిగా అలా మాట్లాడడంపై అందరూ సతమతం అయ్యారు. పార్టీని నడిపించాల్సిన నాయకుడే వెనకడుగు వేసినట్లుగా కామెంట్లు చేయడంపై పలురకాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ సోషల్ వారియర్స్, కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ నిన్న కీలక ట్వీట్ చేశారు. గత రెండు రోజులుగా కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ వేధింపులు ఆరంభం మాత్రమే అని, ముందుముందు మరింతగా పెరుగుతాయని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులు, సోషల్ వారియర్స్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ చేసే వ్యక్తిగత దాడులను తట్టుకొని నిలబడాల్సిన అవసరం ఉందని, అబద్ధాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుందని, తప్పుడు ప్రచారం చేసే ప్రమాదమూ ఉందని తెలిపారు. అంతేకాకుండా.. డీపీ ఫేక్ టెక్నాలజీతో, పెయిడ్ ఆర్టిస్టులతో తప్పుడు ప్రచారం చేసే ప్రమాదమూ ఉందని గుర్తుచేశారు. బీజేపీ, టీడీపీ, వారి పెయిడ్ సోషల్ మీడియా మొత్తం బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయబోతున్నట్లు వెల్లడించారు.
ఎలాంటి పరిస్థితులు వచ్చినా వెనుకడుగు వేయొద్దని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మన పోరాటం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగేది లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుతుండడంతో సీఎం రేవంత్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిందేనని పిలుపునిచ్చారు.
కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఒక్కసారిగా సంచలనంగా మారింది. అటు సొంత పార్టీ కేడర్‌లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. అసలు పార్టీలో ఏం జరుగుతోంది అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై, స్కీములలో జరిగిన స్కాములపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే విచారణలు చేయిస్తోంది. ప్రధాన పథకాల్లో జరిగిన అవినీతిపై విచారణలు చివరి దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరంతోపాటు జీఎస్టీ స్కామ్ తదితర వాటిపై విచారణ ముగింపు దశకు చేరుకుంది. అయితే.. వీటిలో గత ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన నేతలే ఇరుక్కునే అవకాశాలు ఉండడంతో కేటీఆర్ ఇలా యూటర్న్ తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళికి ముందే బాంబులు పేలబోతున్నాయని పెద్ద బాంబు పేల్చారు. ఈ క్రమంలో ఏ క్షణాల ఏం జరుగుతుందో తెలియక రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది. ఈ క్రమంలో కేటీఆర్ కూడా ఈ వ్యాఖ్యలు చేయడం మరింత చర్చకు దారితీసింది.