పిలిచారా? రాలేదా? కాంగ్రెస్ మ్యానిఫెస్టో సభలో షర్మిల లేరేం..?
అయితే, ఈ సభకు పది లక్షల మంది జన సమీకరణ టార్గెట్ గా పెట్టుకుంది.
తెలంగాణ గడ్డపై నుంచి కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల గర్జన మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా ఎన్నికల సమరానికి శంఖారావాన్ని ఇక్కడినుంచే పూరించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడంతో సెంటిమెంట్ గా భావించి లోక్ సభ ఎన్నికలకూ ఆదే ప్రాంతాన్ని ఎంచుకుంది. అయితే, ఈ సభకు పది లక్షల మంది జన సమీకరణ టార్గెట్ గా పెట్టుకుంది. దానిని సాధించి చూపింది.
మ్యానిఫెస్టో ఇక్కడే రిలీజ్..
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను మీడియా ముందు ప్రకటించారు. అనంతరం నేరుగా తెలంగాణ బయల్దేరి వచ్చారు. తుక్కుగూడ సభలోనే మ్యానిఫెస్టోను ప్రజల ముంగిటకు తెచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మ్యానిఫెస్టో విడుదలలో పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాల రీత్యా ఆయన తుక్కుగూడ రాలేదు. కాంగ్రెస్ లో టాప్-5 లీడర్లలో ఒకరైన కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర కీలక నాయకులు ఈ సభకు హాజరయ్యారు.
షర్మిల రాలేదెందుకో?
తుక్కుగూడ సభ కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్ఠాత్మకం. మ్యానిఫెస్టో విడుదల రీత్యానే కాక.. దక్షిణాదిన కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు వచ్చే రాష్ట్రం తెలంగాణనే. అయితే, తుక్కుగూడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సభకు ఇటీవలే ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితులైన వైఎస్ షర్మిల హాజరుకాలేదు. ఏపీలో ప్రస్తుతం ఆమె ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అయినప్పటికీ తుక్కుగూడ సభకు రావడం పెద్ద కష్టమేం కాదు. కానీ, అగ్ర నేత రాహుల్ పాల్గొన్న సభకు పొరుగు రాష్ట్రమైన ఏపీలోని పార్టీ అధ్యక్షురాలిని ఆహ్వానించారా? లేదా? అనేది తెలియరాలేదు. అందులోనూ సొంత పార్టీని విలీనం చేసి వచ్చిన నాయకురాలు.. తొలిసారి కీలక ఎన్నికలను ఎదుర్కుంటన్న నాయకురాలు.. మొదటిసారి ఎంపీగా పోటీ చేస్తున్న నాయకురాలు కాంగ్రెస్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక సభలో పాల్గొంటే బాగుండేది. బహుశా ఎన్నికల కారణంగానే ఆమె రాలేకపోయారు అనుకున్నా.. ఇంకా చాలా సమయం ఉన్నందున అది సరైన కారణంగా కనిపించడం లేదు.
వచ్చి ఉంటే.. మైలేజీ దక్కేది
షర్మిల గనుక తుక్కుగూడ సభలో పాల్గొని ఉంటే ఆమెకే వ్యక్తిగతంగా మైలేజీ దక్కేది. తెలంగాణ ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలతో షర్మిల వేదిక మీద ఒక్కసారి కూడా కనిపించలేదు. ముందుముందు అవకాశం ఉన్నప్పటికీ.. తుక్కుగూడ సభలోనే పాల్గొంటే బాగుండేది. ఏదిఏమైనా హాజరుకాలేకపోవడం ఆమెకే మైనస్.