కాంగ్రెస్‌ అభ్యర్థులకు రేట్లు ఫిక్స్‌ చేసిన షర్మిల!

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న నానుడిని పాటిస్తోంది.. కాంగ్రెస్‌ పార్టీ. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ లో తాను పోగొట్టుకున్న పునర్‌ వైభవాన్ని తిరిగి సాధించాలనే కృతనిశ్చయంతో ఉంది.

Update: 2024-01-26 07:35 GMT

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న నానుడిని పాటిస్తోంది.. కాంగ్రెస్‌ పార్టీ. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ లో తాను పోగొట్టుకున్న పునర్‌ వైభవాన్ని తిరిగి సాధించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిలకు కాంగ్రెస్‌ అధిష్టానం అవకాశమిచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కాంగ్రెస్‌ పార్టీలో గతంలో ఉన్న సీనియర్‌ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ క్రౌడ్‌ ఫండింగ్‌ ను చేపట్టిన సంగతి తెలిసిందే. ‘డొనేట్‌ ఫర్‌ దేశ్‌’ పేరుతో ఇప్పటికే క్రౌడ్‌ ఫండింగ్‌ కు శ్రీకారం చుట్టింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేయబోయే అభ్యర్థులు చెల్లించాల్సిన విరాళాన్ని వైఎస్‌ షర్మిల ప్రకటించారు. అసెంబ్లీకి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు రూ.10 వేలు, పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు రూ.25 వేలు పార్టీకి చెల్లించాలని షర్మిల కోరారు. ఇది పార్టీకి అభ్యర్థులు ఇచ్చే విరాళమని.. ఈ మొత్తం పార్టీ నిధికి చేరుతుందని వెల్లడించారు.

మరోవైపు గతంలో కాంగ్రెస్‌ పార్టీలో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో కలిసి నడిచినవారిని వైఎస్‌ షర్మిల పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇందుకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్‌ లో ఉన్న సీనియర్‌ నేతలతోపాటు పార్టీకి దూరంగా ఉన్న నేతలతోనూ సమావేశమయ్యారు. ఈ క్రమంలో మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌ కుమార్, కొణతాల రామకృష్ణ, తన తండ్రి స్నేహితుడు, గన్నవరం వైసీపీ ముఖ్య నేత దుట్టా రామచంద్రరావు తదితరులతో షర్మిల భేటీ నిర్వహించారు.

ఇంకోవైపు వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి వీలుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి వైఎస్సార్‌ జిల్లాలోని ఇడుపులపాయ వరకు వైఎస్‌ షర్మిల బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మరోవైపు పార్టీలో వివిధ పార్టీల నేతల చేరికలపైనా దృష్టి సారించారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వైసీపీలో చేరిపోయారు.




Tags:    

Similar News