వైఎస్‌ షర్మిల ముఖాముఖిలు అందుకేనా?

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసిన ఆశావహులతో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల ముఖాముఖి చేపట్టారు.

Update: 2024-02-29 06:50 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సీపీఐ, సీపీఎం పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు కుదుర్చుకుంది. ఈ మూడు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇస్తోంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసిన ఆశావహులతో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల ముఖాముఖి చేపట్టారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయమైన ఆంధ్రరత్న భవన్‌ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం లోక్‌ సభ నియోజకవర్గాల పరిధిలోని అభ్యర్థులు పాల్గొన్నారు.

ఈ లోక్‌ సభ నియోజకవర్గాల పరిధిలో 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసుకున్న 280 మందితో షర్మిల ముఖాముఖి చర్చించారు. అలాగే పలువురితో ఆమె విడివిడిగానూ మాట్లాడారు.

ఈ ముఖాముఖిలో రాజకీయ, కుటుంబ నేపథ్యం, కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పటినుంచి పని చేస్తున్నారు? ఏయే హోదాల్లో పార్టీకి సేవలందించారు? టికెట్‌ ఇస్తే ఎన్నికల్లో గెలుపొందేందుకున్న అవకాశాలు తదితర విషయాలపై వారితో షర్మిల చర్చించారు.

అలాగే ఆయా జిల్లాల్లో రాజకీయ పరిణామాలు, పరిస్థితులపైన కూడా వైఎస్‌ షర్మిల ఆరా తీశారు. తొలి రోజు 49 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో మాట్లాడిన షర్మిల మరో 63 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసిన వారితో ఫిబ్రవరి 29న సమావేశమై చర్చించనున్నారు.

కాగా సీఎం జగన్‌ అవినీతికి పాల్పడుతున్నారని తెలిసీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని షర్మిల నిలదీశారు. జగన్‌ ఇక్కడ మైనింగ్, లిక్కర్, ఇసుక మాఫియా చేస్తున్నారని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా ఆరోపించారని గుర్తు చేశారు. రాష్ట్రాల పట్ల వాచ్‌ డాగ్‌ గా ఉన్న కేంద్రం.. జగన్‌ విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదని షర్మిల ప్రశ్నించారు.

జగన్‌ బీజేపీకి వెలుపల లేరని.. ఆయన బీజేపీలోనే ఉన్నారనడానికి వేరే సాక్ష్యాలు అక్కర్లేదని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ పై కేంద్రం చర్యలు లేవంటే ఆయన బీజేపీలోనే ఉన్నారని అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీకి జగన్‌ బీ టీం కాదని.. జగన్‌ ఉన్నదే బీజేపీలోనేనని అని షర్మిల హాట్‌ కామెంట్స్‌ చేశారు.

Full View
Tags:    

Similar News