టీడీపీలోని కాంగ్రెస్ మాజీలకు షర్మిల పిలుపు వినిపిస్తుందా...!?

ఎందుకంటే ఎంత చెడ్డా కాంగ్రెస్ జాతీయ పార్టీ. గతంలో సంగతి ఎలా ఉన్నా ఇపుడు కాంగ్రెస్ హై కమాండ్ కూడా ఏపీకి వచ్చి గట్టిగా ప్రచారం చేస్తుంది. నిధుల విషయంలో కూడా కొంత సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Update: 2024-01-22 04:00 GMT

ఏపీలో కాంగ్రెస్ వట్టిపోయిన ఆవుగా మారి పదేళ్ళు దాటుతోంది. కాంగ్రెస్ లో ఉన్న వారు అంతా వైసీపీలో ఎక్కువ మంది అలాగే టీడీపీలో మరికొంతమందిగా సర్దుకున్నారు. వైసీపీలో ఎక్కువ శాతం కాంగ్రెస్ వారు ఉన్నారు. వారిలో చాలా మందికి ఈసారి టికెట్లు రావు అని అంటున్నారు. ప్రధానంగా ఒక బలమైన సామాజిక వర్గం వైసీపీలో రగులుతోంది అన్న వార్తలు ఉన్నాయి. దాంతో వారిలో ఎక్కువ మందికి ఇపుడు కాంగ్రెస్ ఒక ఆశాకిరణంగా ఆప్షన్ గా కనిపిస్తోంది అని అంటున్నారు.

ఇదే సమయంలో వైఎస్ షర్మిల నాయకత్వం కాంగ్రెస్ కి తెలంగాణాలో గెలుపు ఇండియా కూటమికి కొద్దో గొప్పో జాతీయ స్థాయిలో ఉన్న ఊపు ఏపీలో కాంగ్రెస్ కి హుషార్ తెచ్చే చాన్సులను ఎవరూ కాదనలేరు. ఇదిలా ఉంటే అటు అధికార వైసీపీలో టికెట్లు రాని వారు ఇటు టీడీపీలో కూడా అవకాశాలు లేని వారు కాంగ్రెస్ వైపు చూసేందుకు వీలు ఉంది.

ఎందుకంటే ఎంత చెడ్డా కాంగ్రెస్ జాతీయ పార్టీ. గతంలో సంగతి ఎలా ఉన్నా ఇపుడు కాంగ్రెస్ హై కమాండ్ కూడా ఏపీకి వచ్చి గట్టిగా ప్రచారం చేస్తుంది. నిధుల విషయంలో కూడా కొంత సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఏపీ కొత్త ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఒక పిలుపు ఇచ్చారు.

ఏ కారణం చేతనైనా కాంగ్రెస్ ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిన వారు అంతా తిరిగి కాంగ్రెస్ లో చేరాలని ఆమె కోరారు. తాను ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటనలు చేస్తాను అని ఆమె ప్రకటించారు. తొమ్మిది రోజుల పాటు ఆమె జిల్లా టూర్లు చేయనున్నారు. రోజుకు మూడు జిల్లాలు ప్రతీ జిల్లాలో ఒక మీటింగ్ తో షర్మిల ఏపీలో కాంగ్రెస్ ని కదన రంగంలోకి పరుగులు తీయిస్తారు అని అంటున్నారు.

అయితే కాంగ్రెస్ లో ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి షర్మిల పార్టీలో చేరిపోయారు. మరి కొందరు చేరే చాన్స్ ఉందని అంటున్నారు. ప్రతీ జిల్లా టూర్ లోనూ కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని షర్మిల చెబుతున్నారు. మరి ఆ లిస్ట్ ఏంటి, అలా చేరేవారు ఎవరు అన్న చర్చ మొదలైంది.

వైసీపీలో వారు ఎటూ సీటు దక్కక చేరే వారు ఉంటారు అనుకున్నా టీడీపీలో మాజీ కాంగ్రెస్ నేతల సంగతేంటి అన్న చర్చకు వస్తోంది. రాయపాటి కుటుంబం ఇపుడు టీడీపీకి దూరంగా ఉంది. రంగారావు ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన వైసీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నా కాంగ్రెస్ కూడా ఆశలు పెంచుకోవచ్చు అని అంటున్నారు.

ఉత్తాంధ్రాలో చూసుకుంటే టీడీపీలో కేంద్ర మాంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ చేరిపోయారు. ఆయన కుటుంబం ఇపుడు కాంగ్రెస్ వైపు వస్తుందా అన్నది చూడాల్సి ఉంది. మరో మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ అయితే జనసేనను ఎంచుకున్నారు. ఆయన శిష్యుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ టీడీపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు.

పెద్ద రాజకీయ కుటుంబాలు ధర్మాన బొత్స వంటివి వైసీపీలో కీలకంగా ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన బొబ్బిలి రాజు మొదట వైసీపీ ఇపుడు టీడీపీలో కొనసాగుతున్నారు. విశాఖ ఏజెన్సీలో చూసుకుంటే కీలక నేతలు అంతా టీడీపీ వైసీపీలో చేరిపోయారు. గోదావరి జిల్లాలలో అదే పరిస్థితి ఉంది. జక్కంపూడి ఫ్యామిలీ వైసీపీలో కీలకంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్ లో ఉన్న రఘురామ వంటి వారు వైసీపీకి వెళ్ళి తిరిగి టీడీపీ అంటున్నారు. ఆయన స్వయంగా కేవీపీ రామంచంద్రరావుకు వియ్యంకుడు కూడా.

ఇదిలా ఉంటే రాయలసీమలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం టీడీపీలో సర్దుకుంటోంది. ఆ కుటుంబానికి ఇపుడు గతంలో ఉన్న ప్రాధాన్యత లేదు అని అంటున్నారు. మరి వారు ఎవరైనా కాంగ్రెస్ లోకి వస్తారా అన్నది చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా రోజుకు మూడు జిల్లా సభకు అని షర్మిల అంటున్నారు. కాంగ్రెస్ అయితే పదేళ్ళుగా కుదేల్ అయి ఉంది.

జిల్లా సభలను నిర్వహించాలంటే అన్ని రకాలుగా బలం ఉన్న వారు రేపటి రాజకీయం మీద ఆశ ఉన్న వారు కావాలి. మరి షర్మిల జిల్లా టూర్లు మొదలైతేనే తప్ప ఎవరు వస్తారు ఏ కీలక నేతలు చేరుతారు అన్నది ఒక క్లారిటీ రాదు అని అంటున్నారు.

Tags:    

Similar News