షర్మిల గెలుపు అందులో ఉందిట....!?

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్లనే తాను పోటీకి సిద్ధపడ్డాను అని అన్నారు.

Update: 2024-05-21 20:06 GMT

కడప ఎంపీ సీటుకు కాంగ్రెస్ తరఫున షర్మిల పోటీ చేశారు. ఆమె నోటా కంటే తక్కువ ఓట్లు 2019 ఎన్నికల్లో తెచ్చుకుని డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ నుంచి పోటీ చేయడమే ఒక సాహసం అయితే కడప నుంచి పోటీ చేయడం మరో సాహసం అని అంటున్నారు.

ఇంతకీ షర్మిల గెలుస్తుందా అంటే ఆమె ఎన్నికల ప్రచారంలో ఒక మాట చెబుతూ వచ్చారు. తాను ఎందుకు పోటీ చేస్తున్నాను అన్నది కూడా చెప్పారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్లనే తాను పోటీకి సిద్ధపడ్డాను అని అన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వానికి సైతం నచ్చచెప్పి తాను పోటీ చేశాను అని ఆమె అన్నారు.

పైగా న్యాయం గెలవాలి ధర్మం గెలవాలి నిందితులు చట్ట సభలకు పోకూడదు అన్న లక్ష్యంతోనే తాను కడప ఎంపీ సీటు బరిలో ఉన్నాను అని ఆమె కచ్చితంగా చెప్పారు. షర్మిల చేసిన వ్యాఖ్యలు ఎపుడూ ఒకేలాగా ఉన్నాయి. న్యాయం తప్పక గెలుస్తుంది అని ఆమె పోలింగ్ తరువాత కూడా చెప్పిన మాట.

మరి న్యాయం గెలవడం అంటే ఏమిటి అన్న దాని మీద అర్ధాలు వెతికితే మొదటగా తట్టేది వైఎస్ షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి గెలవడం. అది సాధ్యపడుతుందా అంటే లాస్ట్ మినిట్ లో వచ్చి ఆమె నామినేషన్ వేశారు. అయినా ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. కానీ విజయం వరించడం కష్టమే. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి తరలిపోయింది.

ఎంతో కొంత వెనక్కి వచ్చినా అది విజాయానికి సరిపోదు. మరి ఎలా ఆమె ఈ మాట అంటున్నారు అంటే ఆమె వైసీపీ ఓట్లను చీల్చడం కోసమే పోటీకి దిగారు అని అంటున్నారు. వైసీపీకి ఉన్న ఓట్లను ఎంత వీలు అయితే అంత చీల్చడం ద్వారా అవినాష్ రెడ్డి ఓటమికి భారీ స్కెచ్ గీస్తారు అని అంటున్నారు.

కడపలో టీడీపీ బలంగానే ఉంది. ఆ పార్టీ 1983లో ఒకసారి గెలిచింది కూడా 1996లో చూస్తే గెలుపు అంచులకు కూడా చేరింది. నాడు వైఎస్సార్ పోటీ పడితే కేవలం అయిదు వేల ఓట్లతో ఆయన బయటపడ్డారు. అపుడు సీఎం చంద్రబాబు అలా కడప ఎంపీ సీటు మీద పట్టు బిగించారు. ఆ తరువాత కూడా కాంగ్రెస్ మెజారిటీలను ఎప్పటికపుడు తగ్గించడంలో టీడీపీ కీలకంగానే ఉంది.

ఇక జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి మళ్లీ వేవ్ మారింది. కడప ఎంపీ సీటులో ఆయన అయిదు లక్షలకు పైగా మెజారిటీతో వైసీపీ తరఫున గెలిస్తే 2014, 2019లలో అవినాష్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈసారి అవినాష్ రెడ్డి ఓట్లకు గండి పెట్టడానికే షర్మిల దిగారు అని అంటున్నారు.

ఎటూ టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఆ పార్టీ ఓట్లు టీడీపీ దక్కించుకున్నా వైసీపీ ఓట్లకు వీలైనంత మేరకు గండి కొడితే టీడీపీ విజయం సాధిస్తుంది అన్నది ఒక లెక్క ఉంది అని అంటున్నారు. పైగా వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ల పాలన మీద జనంలో ఉన్న యాంటీ ఇంకెంబెన్సీ తోడు అయితే దాంతో మరింతగా టీడీపీ ఓటు బ్యాంక్ పుంజుకుంటుందని కూడా అంటున్నారు.

అలా వైసీపీ ఓటు బ్యాంక్ ని తగ్గించడం చేస్తే అవినాష్ రెడ్డి ఓటమి పాలు అవుతారు అన్నదే షర్మిల ఎత్తుగడ అని అంటున్నారు. అయితే 2019లో నాలుగున్నర లక్షల ఓట్ల మెజారిటీని సాధించిన అవినాష్ రెడ్డిని ఓడించడం సాధ్యమా అన్నది మరో మాటగా ఉంది. వైసీపీ ఓట్లను ఎంత చీల్చినా ఆయన మెజారిటీతో ఒక లక్ష లక్షన్నర మాత్రమే తగ్గుతుందని కనీసంగా మూడు లక్షల ఓట్ల తేడాతో అయినా అవినాష్ రెడ్డి మళ్లీ గెలిచి తీరుతారు అని అంటున్నారు.

అయితే న్యాయం గెలుస్తుంది అని షర్మిల అంటున్నారు అంటే అవినాష్ రెడ్డి శిబిరంలో ఓటమి భయాన్ని పరిచయం చేసినట్లే అంటున్నారు. ఇక్కడ షర్మిలకు భారీ ఎత్తున ఓట్లు అంటే రెండు లక్షల ఓట్లు దక్కినా ఆమె విజయమే అని తన ఖాతాలో వేసుకునే చాన్స్ ఉంది. లేదా అవినాష్ రెడ్డి ఓటమి పాలు అయితే అది ఘన విజయం కిందకే వస్తుంది అని అంటున్నారు. ఇవన్నీ దాటి ఏకంగా షర్మిల గెలిస్తే అది అద్భుతమే అవుతుంది. మరి చూడాలి ఏమి జరుగుతుందో అని అంటున్నారు.

Tags:    

Similar News