తాను ఓడి.. అన్ననూ ఓడించిన షర్మిల.. ఏపీ ఫలితాలపై ఏమన్నారంటే?

ప్రభుత్వ విధానాల కంటే వివేకా హత్య కేసునే ఆమె ఎక్కువగా లేవనెత్తారు.

Update: 2024-06-05 07:43 GMT

కాలం బలీయమైనది.. కలిసి ఉన్నవారిని విడదీయగలదు.. ఐదేళ్ల కిందట ఆదర్శ అన్నాచెల్లెళ్లలా కనిపించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ షర్మిల. కానీ, ఇప్పుడు కనీస పలకరింపులూ లేనంతగా విభేదాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా షర్మిల తెలంగాణ నుంచి వైదొలగి ఏపీలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక అక్కడి రాజకీయం మరింత మారింది. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ, నేరుగా అన్న వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ వెళ్లారు. ప్రభుత్వ విధానాల కంటే వివేకా హత్య కేసునే ఆమె ఎక్కువగా లేవనెత్తారు. కాగా, ఇవన్నీ పక్కనపెడితే మంగళవారం నాటి ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది.

షర్మిల ఓడి.. టీడీపీనీ ఓడించి

తన అన్నను నేరుగానే విమర్శించి ఆయనను పలుచన చేసిన షర్మిల.. కడప ఎంపీగా స్వయంగా పోటీ చేసి పరాజయం ఎదుర్కొన్నారు. వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి 62,695 ఓట్లతో టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డిపై గెలిచారు. షర్మిల 1.41 లక్షల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఒకవేళ ఇందులో సగం ఓట్లు టీడీపికి పడినా అవినాష్ రెడ్డి ఓడిపోయేవారు. కాగా, మంగళవారం ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడినా.. షర్మిల వెంటనే స్పందించలేదు.

బుధవారం మాత్రం రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఆకాంక్షించారు.

హోదా రావాలి.. పోలవరం పూర్తి కావాలి

''ఏపీకి ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావాలి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి'' అని కోరుకున్నారు. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందడుగు ఎలా వేయాలో.. భవిష్యత్తు కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు కట్టుబడితేనే, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ, ఇక మీద కూడా అదే పంథాలో వెళ్తుందని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడతామని పేర్కొన్నారు.

Tags:    

Similar News