తప్పుడు రేప్ కేసు.. ఆమెకు నాలుగేళ్లు జైలు!

చట్టంలోని సానుకూలతల్ని వాడుకుంటూ తప్పుడు కేసులు పెట్టే వారికి తగిన శాస్తి తప్పదన్న విషయాన్ని రుజువు చేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి.

Update: 2024-05-06 04:42 GMT

చట్టంలోని సానుకూలతల్ని వాడుకుంటూ తప్పుడు కేసులు పెట్టే వారికి తగిన శాస్తి తప్పదన్న విషయాన్ని రుజువు చేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. తన కుమార్తెను అత్యాచారం చేశారన్న తప్పుడు ఆరోపణలతో ఒక యువకుడ్ని జైలుకు పంపిన వైనం చివరకు ఆమెను జైలుపాలు అయ్యేలా చేసింది. తన కూతుర్ని రేప్ చేశారన్న ఫిర్యాదుతో ఒక యువకుడ్ని నాలుగేళ్లు జైలుపాలు చేసిన మహిళకు.. ఇప్పుడు అదే నాలుగేళ్లు జైల్లో ఉండాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన వైనం సంచలనంగా మారింది. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

యూపీలోని బరేలీలోని బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో ఒక మహిళ.. తన పదిహేనేళ్ల కూతురిపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సదరు బాలికను కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఆమె తన సాక్ష్యంగా.. తనను అజయ్ అలియాస్ రాఘవ్ ఢిల్లీకి తీసుకెళ్లి.. మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారం చేసినట్లుగా పేర్కొంది.

ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉండటం.. రిమాండ్ కు వెళ్లిన రాఘవ్ నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నాడు. అనంతరం జరిగిన విచారణలో కోర్టుకు హాజరైన బాధితురాలు.. గతంలో తానిచ్చిన వాంగ్మూలం తప్పని కోర్టు ఎదుట అంగీకరించింది. దీంతో.. జైల్లో ఉన్న అజయ్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. అదే సమయంలో తప్పుడు కేసు పెట్టిన బాలిక తల్లిపై సెక్షన్ 340 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు.. ఆమె తప్పుడు కంప్లైంట్ కారణంగా ఒక యువకుడు అకారణంగా 1653 రోజులు జైల్లో గడిపేలా చేసిన ఆమెకు.. అన్నే రోజులు జైల్లోఉంచాలంటూ జడ్జి ఆదేశాలు జారీ చేవారు. అంతేకాదు.. ఈ వ్యవహారంలో రూ.5.88 లక్షల ఫైన్ విధించారు. ఒకవేళ జరిమానాను చెల్లించని పక్షంలో మరో ఆర్నెల్లు జైల్లోనే ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తప్పుడు కంప్లైంట్లు చేసి తిప్పలు పెట్టే వారందరికి చెంప పెట్టుగా తాజా తీర్పు ఉందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News