వకీల్ సాబ్...ఏంటీ ట్వీట్లు స్వామీ...!
కానీ సిద్ధార్ధ లూద్రా అనబడే వకీల్ సాబ్ కేసు వాదిస్తున్నారు. తీర్పు యాంటీగా వస్తే మాత్రం ఒక ట్వీటేసి అందులోని అర్ధాలు చూసుకోమంటున్నారు.
బాబు గారి లాయర్ అంటే అందునా ఢిల్లీ నుంచి దిగి వచ్చారు అంటే తప్పకుండా ఆయన్ని జైలు నుంచి బయటకు తీసుకుని వస్తారు అనే అంతా నమ్ముతారు. కానీ సిద్ధార్ధ లూద్రా అనబడే వకీల్ సాబ్ కేసు వాదిస్తున్నారు. తీర్పు యాంటీగా వస్తే మాత్రం ఒక ట్వీటేసి అందులోని అర్ధాలు చూసుకోమంటున్నారు.
ఆయన వాదించిన బాబు గారి రిమాండ్ కేసు ఏసీబీ కోర్టులో వీగిపోయింది. ఇపుడు క్వాష్ పిటిషన్ హై కోర్టులో కూడా కొట్టేశారు. గతంలో రిమాండ్ కేసు విషయంలో తీర్పు యాంటీగా వచ్చినపుడు న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినపుడు కత్తి పట్టి యుద్ధం చేయడమే సరైనది అని ఒక ట్వీట్ వేశారు.
దాని అర్ధం పరమార్ధం తమ్ముళ్ళకు ఎంతవరకూ అర్ధం అయిందో తెలియదు కానీ వైసీపీ నేతలకు విషయం పూర్తిగా బోధపడింది. అంతే ఆయన ట్వీట్ మీద ట్రోల్స్ చేయడం మొదలెట్టారు. న్యాయం కనుచూపు మేర దొరకలేదు అని బాబు గారి వకీల్ సాబ్ కి అర్ధం అయింది అని కూడా సెటైర్లు వేశారు.
సీన్ కట్ చేస్తే ఇపుడు హై కోర్టు లో క్వాష్ పిటిషన్ కొట్టివేశారు. మరో వైపు బాబును సీఐడీ కస్టడీకి ఇచ్చారు. ఈ రెండు కేసులలోనూ వాదించిన లూద్రే తీర్పులు వ్యతిరేకంగా రావడంతో యధావిధిగా మరో ట్వీట్ వేశారు.
ఇపుడు ఆయన ఏకంగా కవితాత్మకంగా ట్వీట్ ని అందుకున్నారు. ప్రతీ రాత్రి తరువాత తెల్లారుతుంది. ప్రతీ ఉదయం మన జీవితాలలో వెలుగు ఇస్తుంది అని లూద్రా వేసిన ట్వీట్ తమ్ముళ్ళకు ఏమి అర్ధం అవుతుందో కానీ మరోసారి వైసీపీ ట్రోల్స్ కి దొరికేలా ఉంది అంటున్నారు.
ఇదిలా ఉంటే రాత్రి వేళనే కదా చంద్రుడు కనిపిస్తాడు, వికసిస్తాడు. మరి చంద్రకాంతులు రాత్రి ఎందుకు కనీపించడంలేదు అని చంద్రబాబుని ఉద్దేశించి వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. లూద్రా అయినా మరొకరు అయినా ఇంకే లాయర్ అయినా ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు సుధాకర రెడ్డి కి సరిసాటి కారని రామ్ గోపాల్ వర్మ అయితే ఇంటరెస్టింగ్ ట్వీట్ చేసి లూద్రాకు పోటీగా నిలిచారు. మొత్తానికి కోట్ల రూపాయల లాయర్లను తెస్తే తీర్పుల సంగతి ఎలా ఉన్నా ట్వీట్లతో మాత్రం బాగానే పండిస్తున్నారు అని వైసీపీ నేతలు వెటకారం ఆడుతున్నారు.