ఆ లేడీ ఐఏఎస్ భూమిని కబ్జా చేశారన్న సింగర్!

కలెక్టర్ గా వ్యవహరిస్తున్న రోహిణి సింధూరి.. ఆమె భర్త సుధీర్ రెడ్డి, బావమరిది మధుసూదన్ రెడ్డిలపై సింగర్ లక్కీ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2024-06-22 04:14 GMT

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి కర్ణాటక క్యాడర్ లో పని చేస్తున్న సంగతి తెలిసిందే. నీతికి.. నిజాయితీకి నిలువెత్తు రూపంగా ఆమె పేరును ప్రస్తావిస్తుంటారు. అదే సమయంలో ఆమె తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు.తరచూ వార్తల్లో ఉండే ఆమె.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.

బెంగళూరు శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలోని భూమిని ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి.. ఆమె కుటుంబ సభ్యులు కబ్జా చేశారంటూ దివంగత హాస్య నటుడు మొహమూద్ అలీ కుమారుడు కం సింగర్ లక్కీ అలీ ఆరోపించారు. తాజాగా ఆరోపణలు చేసిన ఈ వ్యవసాయ భూమి యలహంకలోని కంచెనహళ్లి ప్రాంతంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తన వ్యవసాయ భూమి కబ్జాకు గురైందని ఆయన ఆరోపిస్తున్నారు.

కలెక్టర్ గా వ్యవహరిస్తున్న రోహిణి సింధూరి.. ఆమె భర్త సుధీర్ రెడ్డి, బావమరిది మధుసూదన్ రెడ్డిలపై సింగర్ లక్కీ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కబ్జా కేసును బెంగళూరులోని యలహంక న్యూటౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు. అయితే.. ఈ వివాదం కొన్నేళ్లుగా సాగుతోందని చెబుతున్నారు.

సదరు ఐఏఎస్ అధికారికి స్థానిక పోలీసులు సహకరిస్తున్నట్లుగా లక్కీ అలీ ఆరోపించారు. తన వ్యవసాయ భూమిని అక్రమంగా లాక్కోవటానికి ల్యాండ్ మాఫియా కుట్ర పన్నినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి.. దీనిపై సదరు ఐఏఎస్ అధికారిణి రియాక్షన్ ఏమిటో బయటకు రావాల్సి ఉంది.

Tags:    

Similar News