సీతారాం ఏచూరి స్థానంలో ఈ ముగ్గురిలో ఎవరు..?
ఈ సమయంలో సీపీఎం కు కొత్త సారథి ఎవరు అనే విషయంపై చర్చ తెరపైకి వచ్చింది.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యతో గత నెల 19న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ సమయంలో సీపీఎం కు కొత్త సారథి ఎవరు అనే విషయంపై చర్చ తెరపైకి వచ్చింది.
అవును... పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత సీపీఎంకు నేతృత్వం వహించిన రెండో తెలుగువారిగా సీతారాం ఏచూరి పేరుపొందారు. ఇదే క్రమంలో... ఆ పదవిలో ఉండగానే కన్నుమూసిన తొలి నాయకుడిగా మిగిలారు. వరుసగా మూడుసార్లు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఆయన మరణానంతరం ఆ స్థానంలో మూడు పేర్లు తెరపైకి వస్తున్నాయి.
ఇందులో భాగంగా... బెంగాళ్ సీపీఎం కార్యదర్శి మహ్మద్ సలీం, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, కేరళ సీపీఎం కార్యదర్శి ఎంవీ గోవింద్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు త్వరలో పార్టీ అగ్రనేతలు సమావేశమై సీపీఎం పార్టీ కొత్త సారథిని ఎంచుకునే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా... 2015 ఏప్రిల్ 19న విశాఖపట్నంలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకాశ కారత్ స్థానంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎంపికయ్యారు. అనంతరం 2018, 2022ల్లోనూ ఆ పదవిలో తిరిగి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ పదవిలో కొనసాగుతుండగానే మృతి చెందిన నాయకుడిగా మిగిలారు.
ఇదే క్రమంలో 2005 - 17 మధ్య సుమారు 12ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగానూ సీతారాం సేవలందించారు. ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం ఆయన పార్థీవదేహాన్ని సీపీఎం ప్రధాన కార్యాలయం "ఏకే గోపాలన్ భవన్"కు తరలించి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ పార్టీ శ్రేణులు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు.