రెస్క్యూ ఆపరేషన్‌ కు స్వల్ప ఆటంకం... లేటెస్ట్ డిటైల్స్ ఇవిగో!

తాజాగా ఈ విషయాలపై భారీ యంత్రాల యజమాని శైలేష్ గులాటీ ఈ విషయంపై స్పందించారు.

Update: 2023-11-23 11:24 GMT

పది రోజులకుపైగా సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకుతెచ్చే పనులు తుది దశకు చేరుకున్నాయని.. దేశ, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతున్న సహాయక, డ్రిల్లింగ్‌ పనుల్లో భారీ పురోగతి కనిపిస్తోందని అక్కడి వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే వీరు నేడు వెలుగులోకి వచ్చే విషయంలో ఆటంకం ఏర్పడిందని తెలుస్తుంది.

అవును... ఉత్తరాఖండ్‌ లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో... తాజాగా తవ్వకాల సమయంలో శిథిలాలు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడిందని అంటున్నారు. తాజాగా ఈ విషయాలపై భారీ యంత్రాల యజమాని శైలేష్ గులాటీ ఈ విషయంపై స్పందించారు.

ఇందులో భాగంగా... కార్మికుల దగ్గరకు చేరేందుకు చేస్తున్న తవ్వకాల్లో ఐదారు మీటర్ల మేరకు తవ్వాల్సి ఉండగా... ఇనుప శిధిలాలు అడ్డుపడ్డాయని చెబుతున్నారు. దీంతో సహాయక చర్యల పనులు ఆపాల్సి వచ్చిందని తెలిపారు. ఈ శిధిలాలలో ఇనుప పైపులు ఉన్నాయని.. దీంతో వీటిని తొలగించి, కార్మికుల దగ్గరకు చేరుకునేందుకు మరింత సాంకేతిక సహాయం అవసరమని తెలిపారు. దీనికోసం ఢిల్లీ నుంచి నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని అన్నారు.

మరోపక్క కార్మికులు బయటకు రాగానే వారికి అత్యవసర ప్రథమ చికిత్స అందించేందుకు ఛాతి డాక్టర్లతో కూడిన 14 మంది వైద్య బృందాన్ని ఘటనాస్థలి వద్ద సిద్ధంగా ఉంచారు. వీరితోపాటు 12 అంబులెన్సులను, 41 పడకల తాత్కాలిక ఆస్పత్రిని సిద్ధం చేశారు. ఇదే సమయంలో మరీ అత్యవసరమని భావిస్తే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి ఆగమేఘాల మీద తరలించేందుకు హెలీకాప్టర్‌ ను కూడా తెప్పించనున్నట్లు సమాచారం.

కాగా... ఉత్తరాఖండ్‌ ‌ లోని ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో 41 మంది చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో.. నవంబర్ 12 నుంచి కార్మికులు టన్నెల్‌ లోనే ఉన్నారు. అంటే... 13 రోజుల నుంచి ఆ టన్నెల్ లోపలనే ఉండి పోయారన్నమాట. దీంతో... దీన్ని ఇండియాలో అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్‌ గా అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News