సోషల్‌ మీడియా యాక్టివ్‌ యూజర్లు 500,00,00,000!

500 కోట్ల మంది సోషల్ మీడియాలో యాక్టివ్ యూజర్లుగా ఉన్నారని తెలుస్తుంది.

Update: 2023-07-21 13:59 GMT

ఈ రోజుల్లో మెజారిటీ జనం చేతుల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న సెల్ ఫోన్ ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో యూట్యూబ్ లో వీడియోలు చూసేవాళ్లు కొంతమందైతే... సోషల్ మీడియాలో విహరించేవారు కోంతమంది! అయితే ఈ లిస్ట్ భారీగా ఉందని తెలుస్తుంది.

అవును... ప్రస్తుతం ప్రపంచ జనాభాలో ఏకంగా 60 శాతానికిపైగా ప్రజలు సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలంగా ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ జనాభా ఇటీవలే 800 కోట్ల మార్కును దాటిన సంగతి తెలిసిందే. వారిలో సుమారు 500 కోట్ల మంది సోషల్ మీడియాలో యాక్టివ్ యూజర్లుగా ఉన్నారని తెలుస్తుంది.

ఇవి జూలై నెల మొదటినాటి లెక్కల తెలుస్తుంది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 3.7శాతం పెరిగిందని అంటున్నారు. ఈ మేరకు కెపియోస్‌ అనే డిజిటల్‌ అడ్వైజరీ సంస్థ తాజా గణాంకాలను వెల్లడించింది. ఇందులో భాగంగా... ప్రతి 10 మంది ఇంటర్నెట్‌ యూజర్లలో తొమ్మిదిమంది సోషల్ మీడియా యాప్ లను వాడుతున్నట్లు పేర్కొంది.

అయితే గడిచిన ఏడాదిలోనే కొత్తగా సుమారు 17.3 కోట్ల మంది.. సోషల్‌ మీడియాలో చేరినట్లు ఆ సంస్థ నివేదించింది. ఈ సోషల్ మీడియా వినియోగంలో భారత్ కూడా ముందుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... భారత్‌ లో ప్రతి ముగ్గురిలో ఒకరు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారట.

ఇక సోషల్ మీడియాను వినియోగించే యూజర్ల కేటాయింపు సమయంపై కూడా ఈ సంస్థ రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో భాగంగా... ఒక్కో యూజర్‌ రోజులో దాదాపు 2 గంటల 26 నిమిషాలు సోషల్ మీడియా యాప్స్ లోనే గడుపుతున్నట్లు వెల్లడైందట.

వీరిలో అత్యధికంగా బ్రెజిలియన్లు రోజుకు సుమారు 3 గంటల 49 నిమిషాలపాటు వాటిలో మునిగితేలుతుండగా.. ఇక, జపాన్‌ లో మాత్రం ఈ సమయం గంటకు తక్కువగానే ఉన్నట్లు వెల్లడైందని ఈ నివేదిక పేర్కొందని తెలుస్తుంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... డూప్లికేట్‌ అకౌంట్ల కారణంగా ఒక్కో అకౌంటును ఒక్కో వ్యక్తిగా పేర్కొనలేమని.. అలా చేస్తే ప్రపంచ జనాభాకంటే ఎక్కువ సంఖ్య ఉంటుందని తాజా నివేదిక తెలిపిందని తెలుస్తుంది. అందుకే వీటిని సోషల్‌ మీడియా యూజర్‌ "ఐడెంటిటిస్‌"గా పేర్కొన్నట్లు తెలిపిందట.

Tags:    

Similar News