15 ఏళ్లలోపు పిల్లల్లో సగం పో*ర్న్ చూస్తున్నారు.. దీంతో ఆ దేశం ఏం చేసిందంటే?

యూరప్ లోని స్పెయిన్ బాగా డెవలప్ అయిన దేశం. ప్రజలు సైతం ఆధునికంగా ఉంటారు.

Update: 2024-07-07 23:30 GMT

ప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చాక అందులోనూ ఇంటర్నెట్ వాడకం పెరిగాక అశ్లీల చిత్రాలు.. లేదా పోర్న్ వీడియోలు.. సమాజానికి పెద్ద ముప్పుగా మారాయి. బాగా చదువుకున్నవారు, సాధారణ పనులు చేసుకునేవారు, యువత వీటికి అలవాటు పడి పెడదోవ పడుతున్నారు. ఇదే తీరు పిల్లల్లోనూ వ్యాపిస్తోంది. ఇక అసలే విచ్చలవిడితనం ఎక్కువగా ఉండే పాశ్చాత్య దేశాల సంగతి చెప్పేదేముంది..? యువత, మరీ ముఖ్యంగా పిల్లలు సైతం పో*ర్న్ వీడియోలు చూస్తుండడంతో ఆ దేశ ప్రభుత్వం ఆందోళన చెందింది. పరిష్కార మార్గం అంటూ ఓ ఆలోచన తెచ్చింది.

స్పెయిన్ పెయిన్

యూరప్ లోని స్పెయిన్ బాగా డెవలప్ అయిన దేశం. ప్రజలు సైతం ఆధునికంగా ఉంటారు. ఇలాంటి దేశంలో పో*ర్న్ వీడియోలను ప్రజలు ఎక్కువగా చూస్తున్నట్లు తేలింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లగా.. పరిశీలన తేలిందేమంటే.. అశ్లీల వీడియోలు చూసేవారిలో అత్యధికమంది మైనర్లు అని. 15 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలో సగంమంది పో*ర్న్ చూస్తున్నట్లు స్పష్టమైంది. దీన్ని అడ్డుకునేందుకు కొత్త ఆలోచన చేశారు. ‘కార్టెరా డిజిటల్‌ బీటా’ పేరిట ఓ ప్రత్యేక యాప్ ను తీసుకురావాలని భావిస్తున్నారు. స్పెయిన్ లో దీన్ని ‘పజాపోర్టే’ అని పిలుస్తున్నారు. ఇది ఒక మొబైల్‌ వ్యాలెట్‌ లా పనిచేస్తుంది. ప్రభుత్వం జారీ చేసే ఐదు అధీకృత ధ్రువపత్రాల్లో ఏదో ఒక దానికి దీనిని అనుసంధానించాలి. అలా చేస్తే వయసు ఎంతనేది తెలుస్తుంది. ఒకవేళ 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారికి పో*ర్న్ చూసే యాక్సెస్‌ లభించదు. ఆ వయసు దాటినవారికి మాత్రం నెలకు 30 క్రెడిట్లు అందజేస్తారు. ఒక్కో క్రెడిట్‌ కు ఒక క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. పోర్న్ వెబ్‌ సైట్‌ కు యాక్సెస్‌ ఇచ్చేది ఈ క్రెడిట్లే.

వెబ్ సైట్లు యూజర్ల వయసు ధ్రువీకరించుకోవాలి

ప్రభుత్వ యాప్ ద్వారా.. పో*ర్న్ సైట్లు కచ్చితంగా యూజర్ల వయసును ధ్రువీకరించుకోవాలి. కాకపోతే.. ఇది తప్పనిసరి ఏమీ కాదు. ఇతర మార్గాల ద్వారా కూడా వయసును నిర్ధారించుకోవచ్చు. తేల్చాల్సింది మాత్రం మైనర్‌ కాదని ధ్రవీకరించడం. కాగా, ఈ ప్రక్రియను కచ్చితంగా అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ ఇన్‌ స్టిట్యూట్‌ కు ఇచ్చింది. కాగా.. ఈ పద్ధతిని సోషల్‌ మీడియా సైట్లకూ విస్తరించాలని చూస్తున్నారు.

ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందా?

ప్రభుత్వ కొత్త విధానాలతో అశ్లీల చిత్రాలను చూడమన చెబుతున్నట్లుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం మైనర్ల జీవితాన్ని రక్షించేందుకు ఇంతకంటే మెరుగైన మార్గం లేదని చెబుతోంది. పిల్లలను చెడు ప్రవర్తనకు పురిగొల్పే సమాచారానికి దూరంగా ఉంచాలనే ఈయూ (ఐరోపా సమాఖ్య) నిర్ణయానికి అనుగుణంగానే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు పేర్కొంటోంది.

Tags:    

Similar News