అయ్యన్న అడుగులు ఆదర్శమవుతాయా?!
అయ్యన్నపాత్రుడు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా నూతనంగా ఎంపికయ్యారు. అయితే.. గత సభకు ఇప్పుడున్న సభకు చాలా తేడా వుంది
అయ్యన్నపాత్రుడు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా నూతనంగా ఎంపికయ్యారు. అయితే.. గత సభకు ఇప్పుడున్న సభకు చాలా తేడా వుంది. 2014లో బలమైన ప్రతిపక్షం, బలమైన అధికార పక్షం రెండూ ఉన్నాయి. 2019కి వచ్చేసరికి బలమైన అధికార పక్షం.. ఒకింత బొటాబొటి సంఖ్యతో ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కించుకున్న టీడీపీ మాత్రమే ఉంది. ఇక, ఇప్పుడు అసలు ప్రతిపక్ష హోదా లేని వైసీపీ 11 స్థానాలతో సరిపుచ్చు కుంది. దీంతో ఇప్పుడు ఇదే విషయంపై రాష్ట్రంలో రాజకీయ యుద్ధం కొనసాగుతోంది.
మాకు హోదా ఇస్తేతప్ప.. సభకు వచ్చేది లేదన్నట్టుగా.. రూల్స్ కూడా తమకు అనుకూలంగా ఉన్నాయ న్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ లేఖ సంధించారు. ఇక, ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వ నందున మేం మాత్రం ఎందుకివ్వాలని అధికార పక్షం ఎదురు ప్రశ్నించింది. మొత్తానికి సభలో ప్రతిపక్ష హోదా వ్యవహారం.. ప్రతిపక్ష నాయకుల వ్యవహారం కూడా.. సరకందాయంగా మారింది. ఇక, ఇప్పుడు ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపైనే ఉంటుంది.
పిల్లలు-పిల్లలు కొట్టుకుంటుంటే.. తల్లి సర్దిచెప్పినట్టుగా సభపై సర్వాధికారాలు దఖలు పరుచుకున్న సభాపతిగా అయ్యన్న విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయం ఇదే. ``సభ అనేది నాయకులు, రాజకీయాల పక్షం కాదు. ప్రజల పక్షం`` అని గతంలో స్పీకర్‌గా పనిచేసిన అయ్యదేవర కాళేశ్వరరావు చెప్పినట్టు.. ఇప్పుడు ఇదే సూత్రాన్నిఅయ్యన్న పాటించాల్సి ఉంటుంది. అలా పాటించినప్పుడే.. సుదీర్ఘ 45 ఏళ్ల రాజకీయ అనుభవానికి ఆయన నిలువెత్తు గొడుగు పట్టినట్టు అవుతుంది.
ఇగోలు, రాజకీయ దుగ్ధలను పక్కన పెట్టి.. అధికార, ప్రతిపక్షాలను కలుపుకొని పోవాల్సిన బాధ్యత `పెద్దాయన` గా అయ్యన్నపైనే ఉంది. ఇప్పుడు అయ్యన్నపాత్రుడు ఒక నియోజకవర్గానికి నాయకుడు, ఒక పార్టీకి నేత కాదు. ఒక రాష్ట్రానికి దేవాలయం వంటి అసెంబ్లీకి అధ్యక్ష స్థానంలో ఉన్న సభాపతి! ఈ విషయాన్ని పరిశీలించుకుని.. గత అనుభవాలసారాన్ని వడగట్టి.. వ్యవహరిస్తే.. ఆయనకు మరింత గౌరవం.. సభకు మరింత వన్నె చేకూరుతుందనడంలో సందేహంలేదు.
ఇరు పక్షాలను(వైసీపీ-కూటమి పార్టీలు) కూర్చోబెట్టుకుని సంప్రదింపుల ద్వారా.. అయ్యన్న ఈ సమస్యను పరిష్కరించాలి. రాజకీయాలు.. పక్కన పెట్టి మరీ వైసీపీకి తగిన గౌరవం ఇచ్చేలా ఆయన పెద్ద మనసు చేసుకుంటే.. ఆయనకే కాదు.. రాష్ట్ర అసెంబ్లీకి కూడా మరింత గౌరవం పెరుగుతుంది. మరి ఏం చేస్తారో చూడాలి.