రెబల్స్ పై వేటు తప్పదా ? ఇదేనా కారణం ?
అందుకనే రెండుపార్టీల్లోను విచారణ తర్వాత డెవలప్మెంట్లపై ఉత్కంఠ పెరిగిపోతోంది.
రెండుపార్టీల్లోని రెబల్ ఎంఎల్ఏల కతను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తేల్చేస్తారా ? స్పీకర్ కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ తరపున గెలిచిన నలుగురు ఎంఎల్ఏలు వైసీపీకి దగ్గరయ్యారు. అలాగే వైసీపీ తరపున గెలిచిన నలుగురు ఎంఎల్ఏలు టీడీపీలో చేరారు. ఇంతకాలం తమ ఎంఎల్ఏలను పట్టించుకోని వైసీపీ నాయకత్వం నలుగురు ఎంఎల్ఏలు ఆనం రామనాయాణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ రాసింది.
వైసీపీ లేఖను చూసిన తర్వాత టీడీపీలో గెలిచి వైసీపీకి దగ్గరైన ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, కరణంబలరామ్, మద్దాలిగిరి, వాసుపల్లి గణేష్ పైన కూడా వేటువేయాలని స్పీకర్ కు లెటర్ ఇచ్చింది. వీళ్ళకి స్పీకర్ ఆఫీసు నోటీసులిస్తే నెలరోజులు సమయం కావాలని వైసీపీ రెబల్ ఎంఎల్ఏలు అడిగారు. అయితే అన్నిరోజులు కుదరదని చెప్పిన స్పీకర్ కార్యాలయం ఈనెల 29వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు రావాలని నోటీసులు జారీచేసింది. అంటే విచారణకు ఉన్నది రెండురోజులు మాత్రమే.
అందుకనే రెండుపార్టీల్లోను విచారణ తర్వాత డెవలప్మెంట్లపై ఉత్కంఠ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే తొందరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగబోతుండటమే. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఎంఎల్ఏల బలం తగ్గించటం కోసమే ఇపుడు అనర్హత వేటు అంశాన్ని స్పీకర్ టేకప్ చేశారని టీడీపీ నేతలు గోలచేస్తున్నారు. ఎందుకంటే అప్పుడెప్పుడో ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు చేసినే రాజీనామాను స్పీకర్ నాలుగురోజుల క్రితం యాక్సెప్ట్ చేయటాన్ని టీడీపీ ఉదాహరణగా చూపిస్తోంది.
ఎవరి వాదనలు ఎలాగున్నా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వైసీపీ రెబల్ ఎంఎల్ఏలపై అనర్హత వేటు ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు అధికారికంగా టీడీపీలో చేరారు. అయితే టీడీపీ ఎంఎల్ఏలు నలుగురు వైసీపీ ఎంఎల్ఏలుగా చెలామణి అవుతున్నారే కానీ పార్టీలో చేరలేదు. అసెంబ్లీలో కూడా తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని మాత్రమే కోరారు. ఈ టెక్నికల్ అంశం కారణంగా వైసీపీ రెబల్ ఎంఎల్ఏలపై వేటుఖాయమనే వినిపిస్తోంది. అనర్హత వేటుపడితే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి ఐదుగురు ఎంఎల్ఏల ఓట్లు మైనస్సే.