లోకేశ్ రెడ్ బుక్ లోకి ఆ ఎస్పీ పేరు చేరుస్తామన్న తెలుగు తమ్ముడు

అదే సమయంలో జిల్లా ఎస్పీకి యార్లగడ్డ సీరియస్ వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది.

Update: 2024-02-25 04:44 GMT

సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. వైసీపీ నేత వల్లభనేని వంశీ మీదా.. ఆయన అనుచరుల మీదా చెలరేగిపోయిన ఆయన జిల్లా ఎస్సీని కూడా వదల్లేదు. తమ పార్టీకి చెందిన నాయకుల మీదా.. కార్యకర్తల మీదా తప్పుడు కేసులు పెడుతున్నట్లుగా ఆరోపించిన ఆయన పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఊరి చెరువు మట్టిని కొందరు అక్రమంగా తరలిస్తుంటే వారిని ఎందుకు ప్రశ్నించరని పోలీసుల్ని డిమాండ్ చేశారు. అదే సమయంలో జిల్లా ఎస్పీకి యార్లగడ్డ సీరియస్ వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది.

అమెరికా నుంచి వచ్చాడు.. సౌమ్యుడు.. వివాదరహితుడని అనుకుంటున్నారేమో? జిల్లా ఎస్పీ పేరును నారా లోకేశ్ రెడ్ బుక్ లోకి చేర్చే బాధ్యతను వ్యక్తిగతంగా తాను తీసుకుంటున్నట్లుగా వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయాల మీద దాడి.. పక్కవారి ఆస్తుల్ని లాక్కునే దౌర్భాగ్య పరిస్థితి గన్నవరంలో ఉందన్నారు. కడపలో కూడా లేని ఫ్యాక్షన్ రాజకీయాలు గన్నవరంలో ఉన్నాయన్న ఆయన.. గన్నవరంలో టీడీపీ నేతల మీద జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏం చేయాలన్నా అంగబలం.. డబ్బే అయితే.. తనకు ఆ రెండూ ఉన్నాయన్న ఆయన.. కొట్టుకోవటమే ప్రతి అంశానికి పరిష్కారం కాకూడదన్నారు. ఆరుసార్లు తెలుగుదేశం గెలిచిన గన్నవరంలో టీడీపీ పార్టీ బీఫామ్ పెట్టుకొని తాను గెలవటం చాలా తేలికన్న ఆయన.. పార్టీ కార్యాలయాల మీద దాడుల్ని తప్పు పట్టారు. రాజకీయ నాయకుల్ని ఎన్నికల్లో గెలిపించేది పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయించేందుకు కాదన్న ఆయన.. బూతులు మాట్లాడటమే రాజకీయాలకు అర్హత అంటే.. తాను సైతం రెండు రోజుల్లో బూతులు మాట్లాడేస్తానని వ్యాఖ్యానించారు. యార్లగడ్డ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జిల్లా ఎస్పీ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సరికావంటున్నారు.

Tags:    

Similar News