కొత్త వివాదం:ఆ దేశాధ్యక్షుడికి మహిళా మంత్రి ఘాటు ముద్దు!
ప్రపంచ క్రీడల పోటీ ఒలింపిక్స్ ఘనంగా సాగుతున్న వేళ.. కొన్ని వివాదాలు తెర మీదకు వస్తున్న సంగతి తెలిసిందే.
ప్రపంచ క్రీడల పోటీ ఒలింపిక్స్ ఘనంగా సాగుతున్న వేళ.. కొన్ని వివాదాలు తెర మీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఒలింపిక్స్ కు అతిధ్యమిస్తున్న ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇప్పుడో వివాదంలోచిక్కుకున్నారు. నిజానికి.. ఈ వ్యవహారంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. ఆ దేశ క్రీడల మంత్రిగా ఉన్న మహిళ చేసిన చేష్టకు ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల సందర్భంగా ఆయనకు ఘాటు ముద్దు పెట్టిన వైనం ఒక ఎత్తు అయితే.. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
గత వారం పారిస్ లో ప్రారంభమైన ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు మేక్రాన్ తో పాటు పలు దేశాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ క్రీడల మంత్రి ఎమిలీ కాస్టెరా దేశాధ్యక్షుడ్ని కౌగిలించుకొని ఆయన చెంపపై గాఢంగా ముద్దు పెట్టారు. ఈ సమయంలో ఆయన పక్కనే ఉన్న దేశ ప్రధాని గాబ్రియల్ అట్టాల్ సైతం కాస్త ఇబ్బంది పడినట్లుగా కనిపించిన సీన్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ సన్నివేశాన్ని ఫ్రెంచ్ మ్యాగజైన్ మాడమ్ ఫిగారో ఫోటో తీశారు. ఇటీవల తమ కథనంలో ఈ ఫోటోను ప్రచురించటంతో ఇది కాస్తాబయటకు వచ్చింది. ఈ ముద్దు గురించి తమ మ్యాగజైన్ లో పేర్కొంటూ.. ఈ ముద్దు చాలా వింతగా ఉందని.. బహుశా మంత్రి ఎమిలీ అందరి చూపుల్ని ఆకర్షించాలనుకున్నారేమో అన్న వ్యాఖ్యానాన్ని రాసుకొచ్చింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటోలో వీరిద్దరు చాలా సన్నిహితంగా ఉండటంతో వివాదానికి కారణమైంది. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఒక కీలక కార్యక్రమంలో ఇలా అనుచితంగా ప్రవర్తించటం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ తీరును తప్పు పడుతున్నారు. నిజానికి ఫ్రాన్స్ క్రీడల మంత్రి తరచూ ఏదో ఒక వివాదానికి తెర తీస్తారన్న పేరుంది. ఒలింపిక్స్ కు ప్రారంభానికి ముందు సెన్ నది చాలా శుభ్రంగా ఉందన్న విషయాన్ని చాటి చెప్పేందుకు స్విమ్మింగ్ చేశారు. అయితే.. నీటి నాణ్యత మీద ఆందోళనలు ఆగలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆ కొలనులో నిర్వహించాల్సిన కొన్ని పోటీల్ని వాయిదా వేయటంతో.. క్రీడల మంత్రి ఇమేజ్ ఇరుకున పడింది. ఏమైనా.. అంతర్జాతీయంగా ఒక గొప్ప కార్యక్రమంలో దేశ క్రీడల మంత్రి ఇలా వ్యవహరించటం తప్పేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.